Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Varun Ravalakollu

Thriller

4.7  

Varun Ravalakollu

Thriller

ఎవరు - 8

ఎవరు - 8

4 mins
849


8. అదృశ్యం“లక్ష్మి, ఏంటి అలా మౌనంగా ఉన్నావు?”

“మౌనం ఏమి ఉంది, పని చేస్కుంటున్నా, రేపే మహేష్ గారి పుట్టిన రోజు, చాలా పనులు ఉన్నాయి.”

“లేదు. ఎందుకో కోపంగా ఉన్నావు”

“మీ మీదా?”

అవును అన్నట్టు తల ఆడించాను.

“మీ మీద నాకు ఎందుకు కోపం”

“కోపం లేకపోతే మొహం ఎందుకు చాటేస్తావు?”

“రాయుడు గారు, నా పని నన్ను చేసుకోనివ్వండి. మీరు ఇక్కడ అధికారి, అధికారం చూపిస్తే అందంగా ఉంటుంది, అలా కాకుండా ఇలా అమ్మాయిలు మీద అనురాగాలు కురిపిస్తే ఉన్న పని, పనితో పాటు పరువు రెండూ పోతాయి.” కాస్త ఘాటుగానే మాట్లాడింది.

“కనీసం ఇది అనురాగం అని అర్ధం అయ్యింది, లేకపోయి ఉంటే ఇంకా ఎన్ని అనే దానివో. వస్తాను” అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న నాకు అద్దంలో నన్ను తను చూస్తున్నట్టు కనిపించింది.

ఈ అమ్మాయి అర్థం కాదు. ఎందుకు ఇలా దూరం పెడుతుంది. ఇష్టం లేదా? లేక వేరే ఎవరి నైనా ఇష్టపడుతుందా? చిరాకుతో అక్కడ నుండి వచ్చేసాను. ఆ రోజు అంతా పనులుతో సరిపోయింది. రాత్రి వరకు పని చేస్తూ భవంతిలో ఉండిపోయాను. నేను వెనక్కి తిరిగి వెళ్తుండగా మహేష్ గారి ఆఫీస్ గదిలో లైట్ ఇంకా వెలుగుతూ ఉంది. గది తాళం వేయటం మర్చిపోయారు అనుకుని అటుగా వెళ్ళాను. కిటికీ లోనుంచి మహేష్ గారు, కృప కనిపించారు. వారు మాట్లాడుకుంటున్నారు కదా అని నేను వెనక్కి తిరిగి వెళిపోతుండగా .

“పని బాగా చేస్తాడు, కానీ ” మహేష్ భూపతి.

“కానీ? బాగా చేస్తున్నాడు కదా!” కృప

“వీడు కూడా ఆ నాయకుడిలాగా తలనొప్పి తెప్పిస్తునాడు”

“అర్ధం అయ్యింది, లక్ష్మి గురించే కదా! ”

“అవును” మహేష్ భూపతి

“పనిలో నుండి తీసేస్తే సరి ” కృప

“సరిపోదు, ఏమి చేసినా భూపతి గారి స్థాయిలో ఉండాలి ”

కృప సూటిగా మహేష్ ని చూసాడు. అతను ఏమి మాట్లాడకపోయినా అతను కళ్ళలో చీకటి భావాలు స్పష్టంగానే కనిపించాయి. అక్కడ నుండి వచ్చేసాను. ఇక్కడ ఇంక పని చేయలేము అనిపించింది. పని వదిలేయటంతో పాటు లక్ష్మిని కూడా వదిలేయాలి. తాను ఒప్పుకుంటే ఇద్దరం కలిసే వెళ్లిపోవచ్చు. ఏవో ఆలోచనలు, ఎన్నో సందేహాలు, వాటిలోనూ ఆశలు, కోరికలు.

***

తెల్లవారగానే అతిథులు రావటం ప్రారంభం అయ్యింది. వాతావరణం అంత అనుకూలంగా లేకపోయినా అతిథుల రాక తగ్గలేదు. అలీ రంగు రంగుల దుస్తులలో నా దగ్గరికి వచ్చాడు.

“ఏంటి నువ్వు కూడా అతిథిలా వచ్చావు!”

“నీకు తెలుసు, అందరికి తెలీదు కదా!” అలీ

“సరే ఉదయం నుండి లక్ష్మి కనిపించట్లేదు, నువ్వు చూశావా?”

“లేదు .. ఏదైనా పని ఉందా!” అలీ

“లేదు … కాదు... ఉంది, నువ్వు కాసేపు ఇక్కడ ఉండి వచ్చిన వారిని చూసుకో”

“నేను ఒక రోజు అయినా హుందాగా ఉందాము అనుకుంటే, నువ్వు..” అలీ

“పర్లేదు కాసేపే” అని చెప్పి నేను వెళ్లి ఇల్లు అంతా వెతికాను, లక్ష్మి కోసం. ఎక్కడా కనిపించలేదు.

“ఎవరి కోసం వెతుకుతున్నావు?”

“ఆలోక్య గారు!! ఎలా ఉన్నారు మీరు?” (దర్శన్ చిత్రపాటి, కూతురు ఆలోక్య చిత్రపాటి.)

“నేను బాగున్నా, మీ ఏర్పాట్లు కుడా బాగున్నాయి.” ఆలోక్య.

“ఇప్పుడు ఆ మాట చెప్పకండి, అసలు తంతు అంతా రాత్రికి కదా. రేపు ఇదే మాట చెప్పండి, ఆనందపడతాను.”

“సరే, మహేష్ గారిని చూసావా? కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్లారో తెలీదు.”

లేదు అని చెప్పగానే ఆమె వెళ్లిపోయారు.

***

రాత్రి అయ్యింది కానీ లక్ష్మి కనిపించలేదు. భవంతి దీపాలంకరణతో వెలిగిపోతుంది. ఎవరికి వారు వారికి నచ్చిన మత్తులో మునిగిపోతున్నారు. కొంతమంది మద్యం మత్తులో, మరికొందరు జూదం ఆడుతూ, మరి కొందరు మగువల ఆట పాటల్లో. మగ వారంతా ఇలా ఉంటే, ఆడవారు వారి అలంకారాల పోలికలో లీనమైపోయారు. మహేష్ గారు అందరినీ పలకరిస్తూ ఆనందంగా కనిపించారు, వారితో పాటు ఆలోక్యగారు కుాడా ఉన్నారు.

లక్ష్మి కనిపించక పోయే సరికి మనసు మద్యం వైపు లాగింది. నాతో దర్శన్ గారు, కృప గారు, అలీ కూడా జత కలిశారు. వాళ్లు పరిమితిలోనే తాగుతున్నారు. నేను మాత్రం కాస్త ఎక్కువే తాగాను. తాగి ఊరికే ఉండను కదా..

“కృప గారు, లక్ష్మిని చూసారా?” నేను ఆలా అడగగానే అలీ నా వైపు చూసి వద్దు అని తల అడ్డంగా ఊపాడు.

“మత్తులో మాట్లాడ్తున్నావా? లేక మతి చలించిందా, ఆమె ఎవరో తెలుసా, కాబోయ్.. ” అంటూ కృప దర్శన్ గారి వైపు చూసి మాట్లాడటం అప్పేసాడు.

“కాబోయే అంటే , ఇంకా కాలేదు కదా! కాదు కూడా”

దర్శన్ “ఏమి మాట్లాడ్తున్నాడు? ఎవరి గురించి మాట్లాడ్తున్నాడు.”

“ఏమి లేదు దర్శన్ గారు, అలీ వాడిని ఇక్కడ నుండి తీసుకుని వెళ్లిపో ” అని కృప కోపంగా లేచి వెళ్లి మహేష్ గారితో ఏదో చెప్పాడు. మహేష్ గారు దర్శన్ గారిని పిలిచి ఏదో చెప్పి, అక్కడ నుండి వెళ్లిపోయారు.

“రాయుడు, ఇక్కడ ఉండటం మంచిది కాదు, వెళ్లిపో” అలీ

“ఎందుకు?”

“మాట విను” అలీ

“నాకూ ఇక్కడ ఉండాలని లేదు.” అని చెప్పి బయటకు వచ్చేసా, భవంతి ముందు పూల తోట దగ్గర కూర్చున్నా. భవంతి పైన చందమామ, కానీ నాకు చందమామ కదులుతున్నట్టు అనిపించింది. నా ఎదురుగా పై అంతస్థులో ఉన్న మహేష్ గారి గదిలోకి ఎవరో అమ్మాయి వెళ్తున్నట్టు కనిపించింది.

నేను అక్కడ నిద్రలోకి జారుకుంటున్న సమయంలో పెద్దగా శబ్ధం వినిపించింది. చూస్తే మహేష్ గారి గది తలుపు అద్దం పగిలి ఉంది. నేను పైకి పరిగెత్తాను, గది దగ్గరికి వెళుతుంటే మహేష్ గారి గదిలోనుండి వస్తువులు పగులుతున్న శబ్దాలు ఎక్కువయ్యాయి. దగ్గరికి వెళ్లి తలుపులు కొట్టాను, కానీ తలుపు తీయలేదు ఎవరు. కిటికీలో నుండి చూసాను.

లోపాల ఏమి జరుగుతుందో నాకు అర్ధం కాలేదు. మహేష్ గారు గాలిలో చూస్తూ భయపడ్తూ , వస్తువులు గాలిలోకి విసురుతున్నారు. తల పట్టుకుని తనకి తానే నెల మీద కొట్టుకుంటున్నారు. గదిలో ఎవరన్నా ఉన్నారా అని చూసాను. నాకు ఎవరూ కనిపించలేదు. అంతలో మిగతా జనం వచ్చారు. నేను అక్కడ నుండి వేరే వైపుకి పరిగెత్తి, అద్దం పగిలి ఉన్న తలుపు దగ్గరికి వెళ్లి, బయట నుండి గడి తీయటానికి ప్రయ్నతించాను. అంతలో మహేష్ గారు తలుపు దగ్గరికి వచ్చి , అద్దంని కొడుతున్నారు. ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మొహం పసుపుపచ్చ రంగులోకి మారింది. నాకు ఏదో చెప్పే ప్రయ్నతం చేసారు. కానీ మాట అర్ధం కాకుండానే వెనక్కి వెళ్లిపోయారు, ఎవరో లాగినట్టుగా!

నేను మిగిలిన అద్దం పగలు కొట్టి, తలుపు తీసాను. ఆయన “మంటలు మంటలు” అని అరుస్తూ , నన్ను తోస్కుని బయటకు వెళ్లి, అక్కడ నుండి కిందకు దూకేశారు. అందరూ పైన గుమ్మిగూడారు. నేను దగ్గరికి వెళ్లి పైనుండి కిందకు చూసాను. పాదులు నిలువుగా పాకటానికి పాతిన కర్రలు ఆయన శరీరం అంతా గుచ్చుకుని ఉన్నాయి. ఆయనను అలా చూడలేక వెనక్కి వచ్చేసాను. కళ్ళు తిరిగినట్టు అయ్యింది.

***

నేను లేచి బయటకు వచ్చా. అప్పటికి మధ్యాహ్నం కావచ్చింది. నాకు ఇంకా మైకంగానే ఉంది. రాత్రి జరిగింది కళ్ళ ముందు అస్పష్టంగా ఆడుతూ ఉంది. భవంతి లోపలికి వెళ్ళాను. దర్శన్ చిత్రపాటి, ఆలోక్య, కృప ఇంకా వచ్చిన అతిధులు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. పోలీసులు కూడా వచ్చారు, అందులో ఒక అతనికి 45 ఏళ్ళ వయసు ఉంటుంది, పోలీసులుకు ఉండే శారీరక పుష్టిఅతనికి లేదు. కాస్త కురచగా ఉన్నాడు, పైప్ లో పొగాకు కాలుస్తూ, దర్శన్ గారితో మాట్లాడ్తున్నాడు.

అక్కడే ఉన్న అలీని అడిగాను “ఎవరు అతను?”

“ఎవరో పెద్ద ఆఫీసరు అనుకుంట, దర్శన్ గారు పట్నం నుండి పిలిచారు. ఇప్పటి వరకు అందరిని విచారిస్తున్నారు.”

దర్శన్ గారు లక్ష్మిని పిలవమని పనివారికి చెప్పారు. లక్ష్మి వచ్చింది. నాకు ఆమెని చూడగానే మహేష్ గారి గదిలోకి నిన్న రాత్రి వెళ్లిన అమ్మాయి తనే అనిపించింది. ఆమె కళ్ళలో నీళ్ళు, చాలా నీరసంగా కనిపించింది. దర్శన్ గారు మరియు ఆ పోలీస్ ఆమె దగ్గరికి వెళ్లారు.

పోలీస్ ఆమెను ఏవో ప్రశ్నలు ఆడుగుతునట్టు అనిపించింది. అంతలో ముగ్గురు లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నారు. నా ఆలోచనలు మాత్రం, ఆ చూసిన అమ్మాయి ఎవరా అనే దాని చుట్టూ తిరిగాయి. గుర్తుచేసుకున్న కొద్దీ తల బరువు ఎక్కింది కానీ అంత భారంలోనూ నేను చూసిన ఆమె లక్ష్మిలానే అనిపించింది.

కాసేపటికి దర్శన్, లక్ష్మి, పోలీస్ బయటకు వచ్చారు. దర్శన్ గారు అందరి ముందు నిలబడి ”ఇప్పటి నుండి ఈ భూపతి ఎస్టేట్స్ బాధ్యత భూపతి వంశానికి మిగిలిన ఏకైక వారసురాలు, భూపతి రాజు గారి కుమార్తె, మహేష్ భూపతి గారి ముద్దుల సోదరి ‘కుమారి లక్ష్మి భూపతి’ తీసుకుంటారు.

***


Rate this content
Log in

Similar telugu story from Thriller