Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

sudha Atreyaa

Classics

3  

sudha Atreyaa

Classics

ఏ జన్మ ఋణమో!!!

ఏ జన్మ ఋణమో!!!

13 mins
506


సత్య సాయి సేవాశ్రమ్, సత్య సాయి సేవ ట్రస్ట్ విశాఖపట్నం. 


ఒక ఎత్తైన కొండ మీద ఊరికి కాస్త దూరంగా ... చాల ప్రశాంతమైన వాతావరణంలో... దూరంగా సముద్రం అందంగా ఆనందంగా చిన్న పిల్లలా పడుతూ, లేస్తూ ఆకాశాన్ని అందుకోవాలని అందుకోలేక చిన్న బుచ్చుకున్న పాపాయిలా చాల బాగుంది. ఇక్కడి నుంచి ఇంకా బాగుంది. పేరు సేవాశ్రమమే కానీ ఇదొక వృద్ధాశ్రమము. 


నేను ఇవ్వాళే పుట్టపర్తి నుంచి ట్రాన్స్ఫర్ మీద ఇక్కడ మేనేజర్ గా భాద్యతలు స్వీకరించడానికి వచ్చాను. ఆశ్రమం నాకు చాల నచ్చింది. 


ఇదే మొదటిసారి పుట్టపర్తి వదిలి బయట ప్రపంచంలోకీ రావడం. అమ్మ నాన్న ఎవరో తెలీదు... ఎవరో!!! నేను మూడు నెలల పిల్లవాడిగా వున్నప్పుడు నన్ను పుట్టపర్తి లో శివాలయం లో వదిలి వెళ్లారు. అనుకోకుండా ఎప్పుడూ లేనిది ఆవేళ స్వామి గుడికి రావడం నన్ను చూసి ఎత్తుకొని ముద్దాడి ఆ క్షణం లోనే నాకు శివ అని నామకరణం చేసి నన్ను అక్కడే అనాధ ఆశ్రమంలో చేర్పించమని చెప్పి వెళ్లారు.... స్వామి చల్లని ఒక్క!!! చూపుకోసం కొన్ని వేలమంది కాచుకొని వుంటారు. అలాంటిది స్వామే నాకు నామకరణం చేసి నన్ను తన వాడిగా ఎంతో బాగా చూసుకునేవారు. ఎప్పుడు మా ఆశ్రమం వైపు వచ్చినా నన్ను ప్రత్యేకంగా పిలిచి మాట్లాడేవారు. స్వామి కృపా కటాక్షాలతో చుదువు బాగా అబ్బింది. చదువు పూర్తయ్యాక బయటికెళ్లి వుద్యోగం చూసుకోమన్నారు స్వామి. నాకు స్వామిని వదిలి వెళ్లడం ఇష్టం లేదు ఆమాటే అంటే ప్రశాంతి నిలయం లోనే మంచి వుద్యోగం ఇచ్చారు. అందువల్ల స్వామి దర్శనం ప్రతిరోజూ చేసుకునే అవకాశం తో పాటు స్వామి కి దగ్గరి పని వాడినయ్యాను...


ఒకసారి స్వామి "" శివ!!! పెళ్లి చూసుకో అన్నారు."" 

స్వామి!!! ఈ జన్మ మీకే అంకితం అన్నాను. నవ్వి ఊరుకున్నారు. తర్వాత స్వామి అడగలేదు నాకు పెళ్లి చేసుకోవాలనిపించలేదు. చాల మంచి సంబంధాలే వచ్చాయి. స్వామి కి దగ్గరి వాడినని పేరు కదా!!!....




కానీ!!! నా దురదృష్టం మూడేండ్ల క్రిందట స్వామి శివైక్యం అయ్యారు. అప్పటి నుంచి ఎందుకో నాకు అక్కడ వుండాలనిపించలేదు. రాజకీయాలు ఎక్కువయ్యాయీ ... అక్కడ ఉండలేను ఎక్కడికి వెళ్లాలో తెలీదు. ఇలా రోజూ నాలో నేను సతమతమౌతుంటే.... ఒక రోజు నిద్రపట్టక చందమామను చూస్తూ ఉంటే స్వామి వచ్చి 

"" నీవు విశాఖ లో మన ఆశ్రమాన్ని చూసుకోరా అని చెప్పి వెళ్లిపోయారు."" 


కల!!! నిజామా!!! అని నేను తేరుకుని చూసే లోపు మాయమయ్యారు. ఈ విషయం నాకు స్వామి తర్వాత అంతే ముఖ్యమైన శివాలయం పూజారి గారికి చెప్పాను ... 


నే చెప్పిందంతా విని నిజమేరా శివ!!! స్వామి మనకు దూరమయ్యాక ఈ ఊరే కళ తప్పిందిరా. నీకు తల్లితండ్రులు లేరు కదా అందుకే అంత మంది తల్లి తండ్రులను ఇచ్చి ఉంటాడు. స్వామి చెప్పినట్టు చేయారా అన్నారు. 


అదే వెళ్లి పెద్ద వాళ్ళను అడిగాను. స్వామి వాక్కు మహిమో ఏమో వెంటనే ఒప్పుకున్నారు. పైగా నీకు ఎన్నాళ్ళు కావల్సివస్తే అన్నాళ్ళు అక్కడే ఉండవచ్చు అన్నారు. ఇంకంతే అన్ని చకచకా జరిగిపోయాయి... చూస్తుండగానే వెళ్లేరోజు రానే వచ్చింది... నాకు అయినవాళ్ళందరి దగ్గర సెలవు తీసుకొని భారంగా పుట్టపర్తి వదులుతున్న నాకు ఏదో వెచ్చని స్పర్శ నా కన్నీళ్లను తుడుస్తున్నట్టు అనిపించింది. ఏదో ఏమిటి స్వామే ... స్వామి నాతొ కూడా వస్తున్నట్టు అనిపించింది .... స్వామి ఆదేశానుసారం ప్రశాంతి నిలయం లో ప్రశాంతి ఎక్ష్ప్రెస్స్ ఎక్కి రెండో రోజు ఉదయం విశాఖకు చేరుకున్నా... 



ప్రస్తుత మేనేజర్ రైల్వే స్టేషన్ కు వచ్చి నన్ను పిల్చుకెళ్లారు.. మొదట చెప్పినట్టు ఆశ్రమం చాల బాగుంది. కొద్దిగా ఎత్తైన కొండమీద, సముద్రానికి అభిముఖంగా. స్వామి చల్లని చిరునవ్వ్వులాగుంది. దాదాపుగా 50 మంది వృద్దులు వుంటారు. అందులో ఓ ఐదారు జంటలు కూడా వున్నారు. ఆశ్రమం, విశాలంగా మంచి గదులతో, అన్ని సౌకర్యాలతో చాల బాగుంది.. ఆశ్రమం వెనుక తులసి వనం వివిధ పూల చెట్లతో మరో పెద్ద తోట వున్నాయి. వంటగది, డైనింగ్ హాలు, పెద్ద పూజ గది అందులో స్వామి నిలువెత్తు పటం అన్నిటి కన్నా నాకు బాగా నచ్చింది. స్వామికి మనుసులోనే నమస్కరించుకున్నా, 


""నేను నీ తోనే వున్నారా!!!""" అని స్వామి అభయం... 


నాకో చిన్న ప్రశాంతి నిలయం లాగనిపించింది. నాకు నాగది చూపించారు వెళ్లి స్నానాదికాలు ముగించుకొచ్చేలోపే పూజ మందిరం నుంచి శ్రావ్యంమైన కంఠంతో ప్రార్థన మొదలైంది. ప్రార్థన, పూజ పూర్తి కాగానే.. ప్రస్తుత మేనేజర్ అందరికి నన్ను పరిచయం చేశాడు. అందర్నీ పేరు పేరున పలకరింపులయ్యాక, అన్ని అప్పగింతలు పూర్తి చేసి మరు రోజు అందరి దగ్గర సెలవు తీసుకొని అదే ప్రశాంతి ఎక్ష్ప్రెస్స్ కు బెంగళూరు వెళ్లి పోయాడు.



@ @ @ @ @ @ @ @ @ 



నాకు!! ఇదో కొత్త ప్రపంచo ...ఇంత వరకు ఏవెవో తీరికలేనంతగా పనులు... ఇక్కడ అసలు నేనేమీ చేయాలో అర్థం కాలేదు. అన్నింటికీ అందరు పనివాళ్ళు, ఒక క్లర్క్... ఒక పద్దతి ప్రకారం అన్ని నడిచిపోతున్నాయి. నాపని కేవలం అందరికి ఓ పెద్ద దిక్కు అంతే .... 



ఇక్కడ అందరి ముఖాల్లో చిరునవ్వు వుంది. తేడా ఏంటంటే ఆ నవ్వుకు జీవం లేదు అంతే. స్వామి కి క్రమశిక్షణ అంటే ఎంత ఇష్టమో ఇక్కడ అది చాలా బాగుంది... అంతా ఒక పద్దతిగా, ప్రతి ఆదివారం డాక్టర్ చెకప్ పొద్దున్నే అల్పాహారం భోజనాలు రాత్రికి కూడా అందరికి అల్పాహారం.



అంతా మలి సంధ్యలో వున్నవాళ్లు కదా!!! ఎంతో పద్దతిగా వున్నారు... ఎన్నో ఇంటిపనులు చేసుకొని అలవాటున్న చేతులు దర్జాగా కోర్చోమన్నా, కూర్చోకుండా అన్నిటికి పని వాళ్ళున్నా, వద్దని వారిస్తున్నా, ప్రతిపనీ లో సాయం చేస్తున్నారు. ఆడవాళ్ళేమో వంటపని, పూజ గది ఇలా ... మగ వారు తమకు తోచింది ముఖ్యoగా పూల వనంలో.. పూల మొక్కలను చంటి పిల్లలను చూసుకున్నంత అతి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వాటికి ఎవరికి వారు వారి మొక్కలకు నామకరణం చేసుకొని వారిలో వారు


"""చూడు నా మొక్క కొత్త ఆకేసిందనో, మొగ్గేసిందనో"""


ఒక్కళ్లతో ఒకళ్ళు చెప్పుకుంటుంటే ఎంతటి కఠిన పాషాణమైన హృదయమైన ద్రవించక మానదు. వారు ఆ మొక్కలతో పెంచుకున్న అనుబంధం చూసి చాల బాధేసింది. నేను అలాగే చూస్తూవుండడంతో ఒకతను.....


""వీటికి ఎంత ప్రేమను పంచినా భయం లేదు మమ్మల్ని మోసం చేయదు""" అని చెప్తుంటే... కన్నీటి సంద్రాన్ని దాచుకోవడానికి చాల కష్టపడాల్సివచ్చింది.



గోశాలలో కూడా వాళ్ళే... దేవుడా.... గోశాలలో మరి చిన్నపిల్లలయ్యారు. పాలుపితుకుతు అల్లరి కుర్రాళ్లయ్యారు . భోజనాలవరకు ఇలా తలో పనిచేస్తూ భోజనాలయ్యాక అంతా రెస్ట్ మరి ఐదింటికి టీ కాఫీలయ్యాక భజన. పగలంతా కుర్రాళ్ళు సందెవేళకి మలిసందే వాళ్ళు. కనపడని దైన్యం. అందరూ చాల ప్రశాంతంగా వున్నా వారి కళ్ళలో అదేదో దైన్యం... చాల సార్లు ఆకాశం వైపు వారు చూసే చూపులు మనసును మెలిపెట్టేస్తాయి ...నాకు తల్లి తండ్రి లేని లోటు బాగా తెలుసు... నేను అనాధనే అని నాకు అప్పుడప్పుడు చాల బాధేసేది. వీళ్ళేమో తల్లితండ్రుల విలువ తేలీక ఇలా వదిలేశారు. ""పాపం!!! ఏమంత కష్టం ఉంటుంది వీరితో""" ... ఒక్కోసారి వీరి తాలూకు వాళ్ళను పిలిచి చివాట్లు పెట్టాలనిపించేది. కానీ!!! ఏమి చేయలేని నిస్సహాయత. అందుకే వీరిని వీలైనంత సంతోషంగా పెట్టాలన్నదే ఇక నా ధ్యేయంగా మలుచుకున్నా...




స్వామి నిజంగానే నన్ను చాల మంచి చోటికి పంపారు. పుట్టపర్తి లో అదేదో అలజడి ఉండేది. ఇక్కడ అలాంటివి ఏమీలేవు. త్వరలోనే వాళ్లలో కలసిపోయాను. నాకు పైవారి అనుమతులేవి అక్కర్లేదు కాబట్టి ప్రతి నెల మూడో శనివారంను ఆనంద శనివారంగా అందరిని బయటకు పిల్చుకెళ్లాలని అనుకున్నా... వారు మాత్రం బందీల్లాగా ఈనాలుగు గోడలమధ్యే ఎందుకు.... అందుకే!!! అందరం కలిసి మాట్లాడుకోని వెళ్ళవలసిన చోటు నిర్ణయిoచుకొని, ఆ తర్వాత ఒక బస్సు మాట్లాడుకొని వెళ్ళేవాళ్ళం. ఒకసారి సింహాచలo , మరోసారి క్రికెట్ మ్యాచ్, సినిమా ఇలా ప్రతి నెల బయటకు వెళ్ళేవాళ్ళము. దీని వల్ల వాళ్లలో ఏదో కొంత నూతన ఉత్తేజం వచ్చిందనిపించింది. వాళ్లు కూడా ఈ మాట అనడం నాకు చాలా ఆనందం ఇచ్చింది.. 



ఒకరోజు బాగా సంపన్నులైన ఒకావిడ వచ్చింది. నాతోనే మాట్లాడాలి అంటే వెళ్ళాను. ఆవిడ వాళ్ళ కూతురి పుట్టినరోజు ఇక్కడ జరుపుకుంటుందిట. అందరికి ఆవేళ అన్నం ఆవిడే పంపుతుందిట. అంతవరకూ బాగుంది... 

""ఎందుకమ్మా ఇక్కడ జరిపించాలనుకుంటున్నావు, "" అంటే వారి పిల్లలకి వృద్ధాశ్రమం చూపించటానికటా!!!. ఆవిడ చెప్పింది విని నాకు కోపం నషాళానికి ఎక్కింది. ""హతవిధీ!!!"" 


""అమ్మ ఆ స్వామిని ప్రార్తించు ఎప్పటికి వృద్ధాశ్రమం లో వుండే అవసరం రాకూడదని.... వాళ్ళేమి మ్యూజియం లో కళాఖండాలు కాదు. ఏదో అభిమానం పంచుతావేమో అనుకుంటే ఇదేదో మ్యూజియం లాగంటే ఒప్పుకొనేదే లేదు అన్నాను.""



ఐతే ఫండ్స్ ఇవ్వదంట... నామీద పై వారికి కంప్లైంట్ చేస్తుందట . ఆవిడిచ్చే ఫండ్స్ ఎవడికి కావలి. భగవాన్ సత్య సాయి ఉండగా. ఒక పెద్ద నమస్కారం పెట్టి నీ ఇష్టం వచ్చింది చేసుకో!! అని చెప్పి పంపించేసా!!! ... ఇదో ఫాషన్ అయ్యింది. పుట్టినరోజులు ఇలా వృద్ధాశ్రమాల్లో, అనాధాశ్రమల్లో జరుపుకొని ఓ!!!! దేశాన్ని ఉద్దరించినట్టు బయటి ప్రపంచాయనికి డప్పు... ఇంతకు ముందు ఉన్నతను ఒప్పుకున్నాడు అన్నది. అతని భయం అతనిది. కానీ నాకు పైన స్వామి మాత్రమే కదా!!! నాకెందుకు భయం అని స్వామి పటం కేసి చూసా అదే అభయం!!!!. 


ఆవిడెళ్ళిపోయాక బయటకొస్తుంటే... మా సంభాషణ అంతా విన్న ఒక తండ్రి చాల ఆప్యాయతో చెమర్చిన కళ్ళతో నా భుజాన్ని తట్టి వెళ్ళిపోయాడు. ఎంతో తృప్తిగా అనిపించింది.




ఇవాళ మా గోశాలలో వున్న గోమాత గంగ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నేను ఈ హడావుడిలో ఉండగా కొత్త చేరిక వచ్చింది రావాలని మా క్లర్క్ పిలుపు. 



ఇక్కడ గోమాత తన బిడ్డను బలహీనంగా వున్నా కూడా ఎంతో అపురూపంగా తనలో పొదువుకుంది. అక్కడ ఒక బిడ్డ తల్లి ని వదిలించుకోవడానికి సిద్ధంగా వుంది. ఏమిటో విడ్డురం!!! ఒక తల్లి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని తన బిడ్దలను పెంచి పెద్ద చేస్తుంది ... అంత మంది కలిసి తల్లితండ్రుల్ని చూసుకోలేరు... అంత కష్టం ఏమిటో!!! ...



నేను నా ఆఫీస్ లోకి వెళ్ళేపాటికి ఒక ముసిలావిడ, ఇద్దరు వయసులో వున్న ఆడవాళ్లు వున్నారు. ఆ తల్లి చూపులు ఒక అపరాధి లా నేలను చూస్తున్నాయి... నేను వచ్చేపాటికి ఫార్మ్స్ అన్ని నింపి ఫార్మాలిటీస్ పూర్తిచేసున్నారు. ఆ పెద్దావిడ కన్న కూతుర్లే వాళ్ళు. చాల ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆడపిల్లకి అమ్మతో అనుబంధం ఎక్కువ కదా ... 


""మనసనేది వుందా!!! వీరికి"" అనిపించి ఉండ బట్టుకోలేక వారిని పక్కకు పిలిచి అడిగాను ఇదే మాటను. 


వారి సమాధానం... మేము డబ్బులు అన్ని పే చేసేసాము అన్నారు. అయినా నచ్చ చెప్పటానికి చూసాను. . వారిలో ఏ మాత్రం చలనం లేదు. ఫార్మాలిటీస్ అవి పూర్తి చేసి బయలుదేరి పోబోయారు. నేనే అనవసరం అని తెలిసినా కనీసం గది అయినా చూసి ఆవిడను అక్కడ దిగ బెట్టి వెళ్ళమన్నాను. మీ మీద మాకు నమ్మకం వుంది మేము త్వరగ వెళ్లాలని ... కనీసం వెనక్కు కూడా తిరిగి చూడకుండా వెళ్లిపోయారు. నేనే కాదు నాతోపాటు చాలా మంది, వాళ్ళు వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయాము... 


అంతే ఆవిడ వాళ్ళున్నంత సేపు అతికష్టం మీద ఆపుకున్న కన్నీటి సముద్రం సునామి అయ్యిన్ది. అందరం కలిసి ఓదార్చడానికి చాలానే సమయం పట్టింది. అప్పటికి అందరం ధైర్యం చెప్పి నిజానికి అతికష్టం మీద తినపెట్టి పడుకోపెట్టాము. 



ఇప్పటికి పూర్ణమ్మగారు వచ్చి వారం గడుస్తున్నా ఆవిడలో ఎలాంటి చలనం లేదు. అందరం ఎన్నోరకాలుగా ఆవిడను మామూలు స్థితికి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాము. కానీ వచ్చినప్పటినుండి ఇప్పటి వరకు ఆవిడ గళం ఎలా ఉంటుందో తెలీదు. నాకెందుకో భయం వేసి డాక్టర్ గారి సలహా మీద సైక్రియాటిస్టును పిలిపించాము కౌన్సిలింగ్ చేయంచాము ... పెద్ద మార్పేమీ లేదు కానీ కొద్దిగా నయం ఇప్పుడు భోజనాలకు తనే వస్తోంది. కానీ ఉలుకు పలుకు లేదు. మనసులో భాధ చెప్పుకుంటే కాస్త కుదుట పడుతుంది. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఆవిడ నోరు తెరిస్తే కదా. ఎందుకో ఆవిడ మీద నాకు ఏదో వాత్సల్యం ఏర్పడింది. నాకు తెలియకుండానే ఆవిడను అమ్మా!!! అని పిలుస్తున్నాను... అంతేకాదు, అందరికన్నా అమ్మను ఒకింత ఎక్కువగా కనిపెట్టుకొని ఉంటున్నాను...


ఈ రోజు మొదటి సారి అమ్మ మాట్లాడింది... అదీ!!! ఈవాళ తన కూతురి పుట్టినరోజని... నాకు ఒక్క వుదుటన కళ్ళలో నీళ్లు పొంగాయి. ఇంతటి ప్రేమ మూర్తిని వాళ్ళు ఎలా వదులుకున్నారో ఆ భగవంతునికే తెలియాలి.. స్వామి పోయాక నేను మళ్ళి ఏడవడం ఇదే. ఎంత ఆపుకుందామన్నా ఏడుపు ఆగటం లేదు. పిచ్చి తల్లి!!! బరువని వదుల్చుకున్న కూతురి పుట్టినరోజు గుర్తుంచుకుంది. కంటే కూతుర్ని కనాలి అని ఎన్నో చెప్తారు. ఇలాంటి కూతుర్లు కూడా వుంటారా!!! నేను పుట్టి బుద్దేరిగినప్పటి నుంచి నా నోట్లో నుంచి శాపనార్తాలు రావడం ఇదే మొదటిసారి. సరే ఎలాగు మొదటి సారి నోరు తెరిచింది కదా అని మరు రోజు ఆమె గుండె బరువు దించడానికి ప్రయత్నం చేశా ... కథ మళ్ళి మొదటికే నోరు తెరిస్తే ఒట్టు. కానీ ఒకటి మాత్రం అర్ధం అయ్యిన్ది తను నాలో ఎవరినో చూసుకుంటోందని... తను నోరు తెరిచి మాటాడకపోయినా ఆ కళ్ళలో పుత్ర వాత్సల్యం కనపడుతోంది... అది చాలు నాకు...



ఋతువు మారింది, వర్షాలు మొదలయ్యాయి ఆవిడొచ్చి నెలౌతోంది... ఈ సారి మూడో శనివారం వెళ్ల వలసిన చోటు అవకాశం ఆవిడకిచ్చాము. అందరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా మౌనమో లేక కన్నీటి వరదో సమాధానం. వర్షాలు పూర్ణమ్మ మౌనం... ఆనవాయితిగా వస్తున్న ఆనంద శనివారం ఈసారి జరగలేదు. నిజమే వెళ్లకపోవడమే మంచిదైంది. చిన్నగా మొదలైన జడివాన తుఫానుగా రూపు దాల్చిoది. అందరు ఎవరు గదుల్లో వాళ్ళు ఉండిపోయారు. నాకెందుకో అమ్మ దగ్గర వుండాలనిపించింది. 


అమ్మ గదికి వచ్చాను. మొత్తం ముగ్గురుంటారు ఆ గదిలో. పద్మక్క ఖచ్చితంగా వంటగది లో ఉంటుంది. మనసులో ఏ బాదుందో తెలీదు కానీ బయటకు ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. ఇక్కడ చాల మందికి పద్మక్కే ఊపిరి. వయసు ఆరుపదులు దాటినా అందరూ ఆవిడని పద్మక్క అనే పిలుస్తారు. నాకు అదే అలవాటయ్యిoది. సీతమ్మ ఖచ్చితంగా లైబ్రరీ లో ఉంటుంది. తనే ఓ పెద్ద పుస్తకాలయం. నేను అనుకున్న విధంగా తానొక్కరే వున్నారు. తన పక్కన కూర్చొని నా గతం అంతా చెప్పా. నా చిన్నప్పటి తుంటరి విషయాలు చెప్తే మొదటిసారి అమ్మలో చిరునవ్వు మొలకెత్తింది. ఆవిడ నవ్వుతో నా మనసు ఆర్ద్రమైంది. ఒక తల్లి నవ్వు ఇంత అందంగా వుంటుందా!!! . ఆ చంద్రుడిని చూసి బుజ్జి పాపాయి నవ్వినట్టుంది. తను నాతో మాటలు కలపడానికి ప్రయత్నం చేసింది... గాయం మాన్పుకు తనవంతు కృషి చేస్తోందని అర్థం అయ్యింది...ఆ వేళ అమ్మతోనే చాలాసెపుండి భోజనాల సమయానికి నేనే దగ్గరుండి పిల్చుకెళ్లా... 



నాకు తెలియకుండానే రోజురోజుకి ఆవిడతో అనుబంధం పెరుగుతోంది. నేనొచ్చాక వచ్చినందువల్లో, మరిoకేదో... తెల్లవారగానే ఆవిడను చూడనిది నా దినచర్య మొదలవ్వదు. పడుకునేముందు తాను పడుకుందా, లేదా చుసాక కాని నాకు నిద్ర పట్టదు. అమ్మలో కూడా నన్ను చూడగానే కళ్ళల్లో ఒక వెలుగు కనపడేది.... ఏమో ఏదో తెలియని బంధం మామధ్య అల్లుకుంటోంది... ఎంతగానంటే నా జీవితంలో ప్రత్యేకంగా ఎవ్వరి కోసం ప్రార్థన చేయలేదు. మొదటిసారి ఆవిడ కోసం ప్రార్థన చేస్తున్నాను. తను కూడా నేను కనపడకపోతే ఆఫీస్ గదికి వచ్చి నన్ను చూసి వెళ్లిపోయేది...



స్వామి దయ వల్ల ఆవిడ అందరితో కొద్దికొద్దిగా కలవడం మొదలు పెట్టింది. ఇవాళ మొదటి సారి నన్ను నా పేరు తో పిలిచింది. నా స్వామి అప్పుడప్పుడు నా తలా నిమిరి ఒరే శివుడు!!! అనేవాడు మళ్ళి ఈ రోజు అమ్మ ఒరే శివుడు!!! అని పిలిచింది. ఎంత తృప్తిగా అనిపించిందో. నా తల్లే నన్ను పిలిచినట్టుందనిపించింది. చాల ప్రయత్నం తర్వాత ఆవిడ చిరునవ్వు నవ్వింది. నాకే కాదు అందరికి సంతోషంగా అనిపించింది. 



అమ్మ ఎక్కువగా గోశాలలోనే గడుపుతోంది. తను వచ్చిన రోజు పుట్టిన దూడను నిమురుతూ ఎక్కువగా గడుపుతూ ఉంటుంది... బహుశా ఆ దూడతో ఏదో అనుబంధం పెంచుకున్నట్టువుంది. నేనేమొ ఆవిడతో. దూడ తలని తన ఒళ్ళో పెట్టుకొని నిమురుతోంది.. నాకు మళ్ళీ నేను అనాధనే అనిపించింది. ఆ దృశ్యాన్ని అలానే చూస్తున్న నన్ను దగ్గరకు పిల్చి ""శివుడు ఇలా కూర్చో"" అని నేను కూర్చుగానే నా తలను తన ఒడిలో తలపెట్టుకొని నా తల నిమురుతోంది... . నా జీవితం లో ఇదే మొదటిసారి ఇలా ఒడిలో తలవాల్చడం. తను ఎంతో ప్రేమగా నా తలా నిమురుతోంది. పుస్తకాల్లో చదవడమే కానీ ఇదివరకెప్పుడు నా అనుభవంలోకి రాని ఒక మధురానుభూతి!!! నిజంగా ఒక తల్లి ఒడి ఇంత బాగుంటుందా!!!...అని నేను ఎంతో ఆనందిస్తుంటే నా ఆనందాన్ని రెట్టింపు చేస్తూ...""" శివుడు వచ్చే జన్మలో నీకు తల్లిగా పుట్టాలనుందిరా""" అంది ..... ఆ ఒక్క మాట చాలు నా జన్మ ధన్యమైనదింపించింది... తెలియకుండానే కళ్ళు చెమర్చాయి. . కళ్ళు తుడుచుకుంటూ చుస్తే పద్మక్క కొంటెగా నవ్వుతోంది. నేను లేచి అదీ!!! అని ఏదో చెప్పబోయేంతలో....""కొన్నిటికి మాటలు అక్కర్లేదు""... అని ప్రేమగా నా భుజం తట్టి """ నిజమే పూర్ణమ్మ ఇందరి తల్లుల ముద్దుల కొడుకుమరి.... వీడికి అమ్మగా పుట్టాలంటే చాలా పుణ్యం చేసుకోవాలి అని """ నా తలను నిమిరి వెళ్ళిపోయింది..!!!



నేను అక్క వెళ్లినవైపే చేస్తువున్నా """శివా నీవు నాకడుపునే పుట్టురా """ అని అమ్మ వేడుకోలుగా అడుగుతోంది... నాకు ఇంతకంటే ఏమి కావాలి తెలీకుండా ఏర్పడి బంధం ... ఓ అనుబంధంగా అపురూప బంధంగా స్థిరపడింది...




రోజులు చాల ప్రశాంతంగా గడుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే అమ్మ అందరితో కలుస్తోంది. కానీ మాటలు మాత్రం ఒకటో ఆరో అంతే. ఆనంద శనివారాలు, పండగలు అన్ని చాల ఘనంగా జరుపుకున్నాము. ఈసారి శనివారం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తా!!! . పుట్టపర్తిలో ఉండగా ప్రతి దసరాకు స్వామి, నారాయణసేవ అని పుట్టపర్తి మరి చుట్టుపక్కల ప్రతి గడపకు కొత్తబట్టలు ఇచ్చేవారు.... అందుకని ఈసారి శనివారం అందరిని పెద్ద బట్టలకొట్టుకు పిల్చుకెళ్లా . అందరూ ఆశ్చర్యపోయారు. అందరికి నా డబ్బుతో కొత్తబట్టలు కొనిచ్చా. ఈ నా ప్రయత్నం నాకు జీవితంలోనే చాలా తృప్తినిచ్చింది. నాకంటూ ఎవ్వరు లేనివాడిని. ఒకప్పుడు జీతం లేకుండా పని చేస్తా!! అంటే స్వామి ఒప్పుకోలేదు. అవసరార్థం డబ్బు వుండాలిరా...అని జీతం వచ్చే ఏర్పాటు చేశారు. నేనేం చేసుకుంటాను డబ్బు అన్నాను. నాకు తిండి బట్టలు ఇల్లు అన్ని ఉచితమే... అయినా స్వామి ఒప్పుకోలేదు. ఇదిగో అది ఇవాళ ఇలా ఉపయోగపడ్డది. స్వామి సర్వాంతర్యామి... అందరు తమకు నచ్చిన బట్టలు ఎంతో ఇష్టంగా ఎంచుకుంటూ ఆ మలిసందే లో వున్నవాళ్లు కాస్త చిన్నపిల్లల అయ్యారు. అటునుంచటు పెద్ద హోటల్ లో భోజనం ముగించుకొని మా గూడు చేరాము. అందరు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు చెప్తుంటే నేను మనసులోనే అవన్నీ సాయికి అర్పించేసాను. 



విజయదశమి రోజు అందరు కొత్తబట్టలతో శిశిరానికి వసంతం వచ్చినట్టుగా వున్నారు. ఏదో నవ చైతన్యం వారిలో వచ్చిందనిపించింది. ఇంత చిన్న విషయానికే నా!!! ఇలాంటివి వారు వారి జీవితంలో ఎన్నో చూసున్నా!!... ఇవాళే కొత్త బట్టలు వేసున్నారా!!! అనేంతగా సంబరపడిపోయారు. కాసింత ప్రేమేగా వారు కోరుకుంటోంది. అదీ కూడా ఇవ్వలేమా. గట్టిగ నిట్టూర్పు విడవడం మినహా నేను ఏమి చేయలేను.. పద్మక్క వచ్చి నా భుజం తట్టి నా నుదిటిన ముద్దు పెడుతుంటే... నేను అక్క ప్రేమను మొదటిసారి చవి చూసాను. ఈసారి పూర్ణమ్మ ప్రత్యేకంగా వచ్చి ఎందుకో హత్తుకుంది. ఏదో అలోకిక అనుభూతి. మొత్తనికి పండగ చాల వేడుకగా జరుపుకున్నాము. ..


స్వామి జన్మదిన వేడుకలకు పుట్టపర్తి వెళ్లాలని నిర్ణయిoచుకున్నా . అందరిని అడిగాను, అందరం వస్తామన్నారు. మొదటిసారి నా కుటుంబంతో స్వామి దర్శనానికి వెళ్ళాము. అందరు చాల సంతోషించారు. మూడు రోజులు అక్కడే వుండి స్వామి ఆశీస్సులు పూర్ణాంగా పొంది....అందరం తిరుగు ప్రయాణం అయ్యాము. 




అనుకోకుండా ఒక రోజు పెద్దాయన నుంచి పిలుపు రావడం తో బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. మొదటిసారి కుటుంబాన్ని వదిలి వెళ్తున్న కొడుకులావుంది నా పరిస్థితి. ఇంతగా వీరితో నా అనుబంధం పెనవేసుకపోయినదా !!! నాకే ఆశ్చర్యం వేసింది.. నాకు ఇది వరకు పరిచయం లేని అనుభూతులు.... మూడే రోజులు కానీ ఏదో బెంగ... విచిత్రంగా వుంది నా ఈ స్థితి. అమ్మ గురించి బెంగ ఎక్కువైంది. ఇప్పుడిప్పుడే తను కోలుకుంటోంది. పద్మక్కకు అన్ని జాగ్రత్తలు చెప్పా. నిజంగా తను చాల చక్కగ అర్థం చేసుకుంది. అన్ని జాగ్రత్తలు, అవసరమైతే ఖచ్చితంగా ఫోన్ చేయమని క్లర్కు కు చెప్పి, మిగిలిన అందరికి విషయం చెప్పి ప్రత్యేకంగా అమ్మ కు జాగ్రత్తలు చెప్పి బెంగళూరు బయలుదేరాను. బెంగళూరులో మూడు రోజులు తీరిక లేకుండా గడిచిపోయింది. పని వత్తిడివల్ల నాకు ఇక్కడికి ఫోన్ చేయడానికి కుదర్లేదు. తిరిగి బయలుదేరబోతుండగా నా గది లోని స్వామి పటం కొద్దిగా ఒరిగింది. మనసెందుకో కీడు శంకించింది. పద్మక్క ఫోను చేశా... మూడు రోజుల తర్వాత. 



అమ్మకు కొద్దిగా జ్వరంగా వుంది అని చెప్పింది. నేను వచ్చేరోజు తను ఉల్లాసంగా ఆరోగ్యoగా ఉనింది... మరి అంతలోనే ఏమై ఉంటుందా అని భయం వేసింది... తను కూడా క్షేమంగా వెళ్లి లాభంగా రమ్మని దీవించి పంపింది. .. ఇలా జ్వరం ఉంటే అస్సలు వచ్చేవాడినేకాదు... మనసు కల్లోలంగా మారింది. రైలు ప్రయాణం రద్దు చేసుకొని విమానంలో వచ్చేసాను. వచ్చి రాగానే సరాసరి అమ్మ గదిలోకెళ్లా... ఏమాత్రం స్మృహ లేకుండా పడుకొనివున్న అమ్మను చూడగాని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. డాక్టర్ వచ్చి చూస్తూనేవున్నాడు అని పద్మక్క చెప్పింది. ఎందువల్ల ఇంత జ్వరం వచ్చిందని అడిగితె... పద్మక్క చెప్పిన మాటలు విని ఇంకా బాధ వేసింది. నేను బెంగళూరు వెళ్ళినప్పుడు వారి అమ్మాయిలు వచ్చి అవేవో పేపర్లమీద సంతకాలు తీసుకున్నారు. ఆ సంతకం చేయడాని అమ్మ ఒప్పుకోలేదని వారు మాటలతో హింస పెట్టి ఆఖరుకు సంతకం చేయిoచుకొని, ఏడుస్తున్న తల్లిని ఏ మాత్రం దయ లేకుండా తమకేమీ పట్టనట్టు వెళ్లిపోయారని చెప్పింది. ఏమీ మనుషులురా వీళ్ళు డబ్బేన సర్వస్వము, ముఖం మీద ఛీత్కరించాలనిపించింది. ఏమీ చేయలేని నిస్సహాయత. 



అమ్మ దగ్గరే కూర్చుండిపోయా... చాల బెంగగా అనిపించింది. జ్వరం తీవ్రంగావుంది... డాక్టర్ ఇంజెక్షన్ అవి ఇచ్చాడు. ప్రొద్దునకు జ్వరం తగ్గకపోతే ఆసుపత్రిలో చేర్పించామన్నాడు... రాత్రంతా...నుదుటి మీద చల్లని గుడ్డ వేస్తూనేవున్నాను. తెల్ల వారుతుండగా కాస్త జ్వరం తగ్గిందనిపించింది. అమ్మ మెల్లి గా కళ్ళు తెరిచింది.. కళ్ళు తెరిచి నన్ను చూసి గుర్తుపట్టింది కూడా. నన్ను పిలిచి శివుడి వచ్చేసావురా!!! నన్ను వదిలి ఎక్కడికి పోవద్దురా అంది. అమ్మకు ప్రమాణం చేశా... నిన్ను వదిలి ఎప్పటికి ఎక్కడికిపోనని. ఆ మాటకు అమ్మ చాల సంతోషించింది. హాయిగా నవ్వి, ఒరేయ్ శివుడు దాహంగా వుంది మంచి నీళ్లివ్వరా అంది... తన మాటలతో నాకు కాసంత సాంత్వనగా అనిపించింది. మంచినీళ్లు తాగించడానికి తనను నా భుజం ఆసరాగా ఇచ్చి కూర్చుండపెట్టాను. నన్ను చూసి నవ్వుతూ, నా చేత్తో నీళ్లు తాగింది. మూడు గుక్కలు లోనికి వెళ్లాయోలేదో....నాలుగో గుక్క..... వెన్నులో ఒణుకు పుట్టింది... అమ్మ నన్నే చూస్తూ నా భుజం మీదే శివైక్యం అయ్యిన్ది. నాకు నోటా ఒక్క మాట కూడా పెగల్లేదు. అమ్మను అలానే గట్టిగా హత్తుకొని ఉండిపోయా. ఒక శున్యం ఆవహించింది...కాదు అంతా శున్యం అనిపించింది. ఈమె ఎవరు... నేను ఎవరు. ఏమిటి ఈ బంధం!!! . నా కోసమే అమ్మ ప్రాణాలతో వుంది నన్ను చూసి పోవాలని అనుకుంది కాబోలు అనిపించింది. ఏ జన్మ ఋణమో. నాకు నా అన్నవాళ్ళే లేరు. గాలికి పుట్టా, గాలికి పెరిగా. ఇదిగో ఇప్పుడే తల్లి అన్న ఒక బంధం ఏర్పడింది మళ్ళీ మొగ్గలోనే ఆ బంధం నాకు లేకుండా పోయింది . 



అమ్మను అలాగే మంచం మీద పడుకోబెట్టి పద్మక్కను లేపి జరిగింది చెప్పా... క్లర్క్ను లేపి అమ్మను హాల్లోకి స్వామి పటం ముందు పడుకోబెట్టాము... అమ్మను పొట్టనపెట్టుకున్న కూతుర్లకు ఫోన్ చేసాము. ఎన్నిసార్లు చేసినా ఫోన్ మనుగడలో లేదు అనే వస్తోంది. వాళ్ళు మాకు ఇచ్చిన అన్ని నంబర్లకు కాల్ చేసాము. అదే మాటే. ఇక లాభంలేదని వారుండేది విశాఖ నే కాబట్టి వారిచ్చిన అడ్రస్ కు మనిషిని పంపించా... 



పాపం అందరు అమ్మ చుట్టూ. అంతా పెద్దవాళ్ళేవున్నా...ఎప్పుడూ సందడిగా వుండే మా హాలులో స్మశాన ఘాoభీర్యం... కొందరు అదృష్టవంతురాలని...కొందరు అయ్యో!!! అని నాకు మాత్రం నా తల్లి పోయినట్టేవుంది. తల్లి పొతే అందరికి ఎలావుంటుందో నాకు తెలీదు. నాకు మాత్రం నా ప్రాణాలే పోయినట్టుగా వుంది. అమ్మ తాలూకు వారి కోసం పంపిన మనిషి ఒక్కడే వచ్చాడు. వారు ఆరు నెలలక్రితమే ఇళ్ళు అమ్ముకొని వెళ్లిపోయారని, వారి వివరాలు అవి ఎవ్వరికి ఇవ్వలేదని ఇరుగుపొరుగు చెప్పారని చెప్పాడు. ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కాలేదు. ఏమిటి అమ్మ దౌర్భాగ్యం అనిపించింది. 



ఏమి చేయాలో పాలుపోక అమ్మ దగ్గరే కూర్చున్ననన్ను పద్మక్క పక్కకు పిలిచి... """శివ!!! జరగాల్సిన అన్ని క్రతువులు నీవే చేయరా. మీ ఇద్దరిది ఏ జన్మ ఋణమో ఏమో... ఒక కొడుకు స్థానంలో నిలబడి అన్ని చెయ్యరా. నీవు చేస్తేనే ఆ తల్లికి ఆత్మ శాంతి. నిన్నే మరు జన్మలో కొడుకుగా కోరిందంటే ఎంత అనుబంధం పెంచుకుందో నీమీద...నీకోసమే ఆవిడ ప్రాణాలు గట్టిగ పట్టుకొనివుందేమో అనిపించింది. నీచేతుల్లోనే ప్రాణాలు వదిలిన్దిరా. మరేమి ఆలోచించకు... నీకు అభ్యన్తరం లేకపోతె పెద్దకొడుకుగా ఆవిడా దహన సంస్కారాలు చేయరా అన్నది""". 


అయ్యో అక్క!!! నాకేమి అభ్యంతరము. నాకు తలకొరివి పెట్టేవాళ్ళు కానీ, నేను పెట్టాల్సిన వాళ్ళు కానీ నాకెవ్వరూలేరు. అంత కన్నా భాగ్యమా అలాగె అక్క!!... అని చెప్పా. ఏ జన్మ ఋణమో మరి!!! అమ్మకు తలకొరివి పెట్టడానికే నన్ను ఇక్కడికి సాయి పంపాడా అనిపించింది. విధి ఎప్పుడు ఎవరిని ఎందుకు కలుపుతుందో!!! అంతలోనే ఎందుకు విడదీస్తుందో!!! జరగాల్సిన అన్ని క్రతువులు త్రికరణ శుద్ధిగా నా కన్నతల్లే అని గట్టిగ నమ్మి చేసాను. ఒక పవిత్ర ఆత్మ అనంతాకాకాశంలో ఒక తారగా...




అమ్మను క్షణం కూడా మరువలేకున్నా!!!. ఎనిమిది నెలల బంధమే ఇలావుంటే వారు కన్నతల్లిని ఎలా వదిలేశారు అని సాయి ని అడిగా... స్వామి శివైక్యం చెందిన రోజున కూడా ఇదే అడిగా... మమ్మల్నందరిని వదిలి ఎందుకు వెళ్ళావు అని. ..ఎప్పటిలానే స్వామి సమాధానం ఒక చల్లని చూపు ఒక మెత్తటి చిరునవ్వు... కొన్నిటికి జవాబులుండవేమో...!!!! !!



Rate this content
Log in

Similar telugu story from Classics