Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

kavi voleti. Prahaasin

Inspirational

4.6  

kavi voleti. Prahaasin

Inspirational

మ్రోగిన గంటలు

మ్రోగిన గంటలు

6 mins
731


రాత్రంతా తనివి తీరా కురిసిన మేఘాలు ఉదయానికి కాస్త విరామం ఇచ్చాయి.

తరచుగా వస్తున్న ఉరుముల శబ్దం దూసుకొస్తున్న మలయమారుతం రానున్న మరో భారీ వర్షానికి సూచనలు ఇస్తున్నాయి. హైదరాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది సాగర సంగమానికి వచ్చే గోదావరిలా ప్రశాంతంగా ప్లాట్ ఫాం మీదకి వచ్చి ఆగింది రాజధాని ఎక్స్ప్రెస్. బయట వాతావరణం చల్లగా ఉన్నా ఏసీ లోంచి రావడం వల్ల చాలా వేడిగా అనిపించింది సురేష్ కి. తను ఎప్పుడు ఫ్లైట్ మీదే వస్తాడు కాకపోతే అనుకోని పరిస్థితుల్లో ఫ్లైట్ రద్దవడంతో ట్రైన్ లో రావలసి వచ్చింది.

ప్లాట్ఫాం మీదకు రాగానే 

"సురేష్ మీరేగా"? అంటూ ఎదురు వచ్చాడు డ్రైవర్.


"శీను ఎక్కడ ?"

సర్ తనకి ఒంట్లో బాగోలేక రాలేకపోయాడు నన్ను పంపించాడు అంటూ సురేష్ చేతిలో లో సూట్ కేస్ అందుకోబోయాడు డ్రైవర్


" పర్లేదు నేనే తీసుకొస్తా, సరే ఇప్పుడు ఎలా ఉంది శీనుకి ?"

"బాగానేే ఉంది సార్" ఒక డ్రైవర్ పై అతను చూపించే ప్రేమకు పొంగి పోయాడు డ్రైవర్.


సర్ మీరు ఇక్కడే ఉండండి కారు తీసుకు వస్తాను" అంటూ వెళ్లిపోయాడు డ్రైవర్.


చుట్టూ చూస్తున్నాడు సురేష్ ప్రయాణికులు, అమ్మకందారులు, పోలీసులు, కూలి పని వారు మొత్తంగా పెద్ద గందరగోళంగా ఉంది స్టేషన్.

హఠాత్తుగా కొంచెం పక్కగా ఫ్లాట్ ఫాం గోడకి ఆనుకుని కూర్చున్న ఓ చిన్న గుంపు సురేష్ దృష్టిని ఆకర్షించింది.

ఓ నలుగురు వ్యక్తులు దాదాపు తన వయసు వారే ఉంటారు చూడగానే టీ లు అమ్ముకునే వాళ్లని తెలుస్తోంది. అందులో ఒకడు గట్టిగా నవ్వుతూ అంటున్నాడు .

"వీడైతే బెల్ కొట్టగానే పరుగో పరుగు"


' అరే మొన్న అయితే గంట కొట్టగానే గుడిలోంచి పరిగెత్తుకుని వచ్చేసాడు "

అని నవ్వుతూ ఇంకొకడు జత కలిపాడు .

మధ్యలో నవ్వలేక ఏడవలేక కాస్త ఇబ్బందిగా మొహం పెట్టిన వాడే వీళ్ళ హాస్యం చతురతకు బాధితుడు అని గ్రహించాడు సురేష్.

ఒక్క నిమిషం ఆలోచించాడు .

అతని మొహం, వేషధారణ, చింపిరి జుట్టు ,మాసిన గడ్డం పేదరికానికి నిలువెత్తు రూపంలా ఉన్నాడు అతను. వాళ్ల దగ్గరికి వెళ్ళాడు సురేష్, హఠాత్తుగా ఓ అపరిచిత వ్యక్తి తమ ముందుకు వచ్చి నిలబడడం చూసి తెల్లబోయి చూసారు నలుగురు.

" నేను నీతో మాట్లాడాలి" సూటిగా ఆ వ్యక్తి వైపు వేలు చూపించి నవ్వుతూ అడిగాడు సురేష్.

" మీరెవరు అడిగాడు ?"

ఆ వ్యక్తి .


" నా పేరు సురేష్ ఓ పెద్ద కంపెనీకి  ఎం డి ని. మీ పేరు?'


" రాజు "


"రాజు, నేను నీతో కాసేపు మాట్లాడాలి దయచేసి కాదనకు,,"


ఈలోగా కారు తీసుకు వచ్చాడు డ్రైవర్.


"ఖరీదైన బట్టలు హుందాగా ఉన్న ఆ వ్యక్తికి ఇతనితో పనేంటి??"

అక్కడున్న అందరిలోనూ అదే ప్రశ్న


రాజు ముఖంలో సందేహాల్ని గమనించి చెప్పాడు సురేష్ 

"నువ్వేమీ ఆలోచించకు, ఒక్క పదినిమిషాలు కేటాయించు సరేనా .."


"సరే సార్ "తన తోటి వాళ్లకు ఏదో చెప్పి సురేష్ తో పాటు కారు ఎక్కాడు రాజు.


సురేష్ వ్యక్తిత్వం గురించి శీను ద్వారా చాలాసార్లు విన్నాడు డ్రైవర్. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు.


"డ్రైవర్, కారుని ముందు స్ఫూర్తి హాస్పిటల్ కి పోనీ తరువాతే ఆఫీస్ కి"

అని డ్రైవర్ కి చెప్పి రాజు కేసి తిరిగాడు సురేష్ .


"రాజు నిన్ను నీ స్నేహితులు ఆటపట్టించడం చూసాను ఎందుకలా? నీకు నిజంగా గంట శబ్దం అంటే భయం ఉందా?'


"నా సమస్య చెప్పిన మీకు అర్థం కాదు సార్, తెలిసినా ఏమీ చేయలేరు "


"లేదు లేదు నేను అర్థం చేసుకోగలను మీ సమస్యకు పరిష్కారం కూడా చూపించగలను నన్ను నమ్ము"


" నిజంగానా ?"

తన చేతిపై ఆప్యాయంగా చెయ్యి వేసిన సురేష్ ని చూస్తూ అడిగాడు రాజు 

"అవును నాకు చెప్పు"


"కరీంనగర్ శివార్ల లో ఇరవై ఏళ్ల క్రితం రాజ్ కుమార్ బాలల అనాధ శరణాలయం ఉండేది. ఊహ తెలిసినప్పటికి నా ఇల్లు అదే.. తనవారంటూ ఎవరు లేని నాలాంటి పిల్లలందరికీ అదే నివాసం. పొద్దున్నే ఎవరూ వచ్చి నిద్ర లేపరు .గంటలు మోగగానే నిద్ర లేవాలి. మన ఆకలితో సంబంధం లేదు గంట కొట్టినప్పుడు వెళ్లి తినాలి. స్నానానికి, చదువుకి ,ఆటలకి అన్నింటికీ గంటలే ఆధారం.

 ఆఖరి గంట కొట్టగానే వెళ్లి నిద్ర పోవాలి .

జోల పాటల కోసం ఆలోచించనక్కర్లేదు. ఎవరైనా వచ్చి నిద్ర రావట్లేదా అని అడుగుతారని ఆశించక్కర్లేదు. ఉదయాన్నే వచ్చి హత్తుకునే వారు ఉండరు. 

అన్నం సరిపోయిందా అన్న ప్రశ్నే లేదు.. అంతా గంటల ప్రపంచం. ఇప్పుడైనా సాయంత్రం గంటలు వరుసగా కొడితే ప్రిన్సిపాల్ రూమ్ కి అందరూ వెళ్ళాలి. అది కేవలం దండించడానికి మాత్రమే. పొగడ్తలు బహుమానాలు లాంటివి అసలు ఊహాతీతం.


నాకు ఆ గంట శబ్దం ఒక భయంకర అనుభవంలా తయారయింది .అది వినలేక చాలా చాలా బాధపడే వాడిని. నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు తిరుపతి నుంచి ఒక జంట ఎవరినైనా దత్తత చేసుకోవడానికి మా అనాధ శరణాలయానికి వచ్చారు. అదృష్టమో దురదృష్టమో వారికి నేను నచ్చాను .

అప్పుడు నాకు బోలెడంత సంతోషం. కొత్త జీవితానికై కలలు కంటూ వాళ్ళింటికి వెళ్లాను. కానీ కొన్ని రోజులకే నాకు అర్థమైంది నేను అంత అదృష్టవంతుడిని కాదని.

నన్ను తెచ్చుకున్న జంటకు పిల్లలు లేరు సమాజంలో గుర్తింపు కోసం కేవలం కంటితుడుపుగా మాత్రమే వాళ్లు నన్ను పెంచుకుంటున్నారు. తప్ప నాపై ఎలాంటి ప్రేమ వాళ్లకు లేదు. పొద్దున్నే భుజంపై ఒకసారి తట్టి వెళ్లిపోయేది అమ్మ. బహుశా ఒక్క గంట కే లేవడం ఎలాగూ అలవాటే కదా.. అనే భావన కావచ్చు.


ఎప్పుడైనా ఆకలి అని నేనంటే కోప్పడే వాళ్ళు.. ఎవరైనా వింటే అది చిన్నతనం అని వాళ్ళ ఉద్దేశ్యం.

కంచంలో అన్నం పెట్టి ఓయ్ అని చప్పట్లు కొట్టేవారు.. అదే పిలుపు.

నాన్న ఒక టైలర్ అమ్మ కూడా అతనికి సహాయం చేసేది.

వాళ్లు నన్ను ఓ వీధి బడిలో వేసారు. అయితే అక్కడ ఆ బడిలో గంట శబ్దం మళ్ళీ నాలో తీవ్రమైన ఆందోళన కలిగించేది. వినలేక బడి నుంచి పారిపోయే వాడిని. దాంతో అమ్మానాన్నలకి నా తీరు నచ్చలేదు. "పోయి పోయి పిచ్చోన్ని తెచ్చుకున్నామా "అని అనుమానించారు.

తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు.

నాకైతే తిరిగి శరణాలయానికి వెళ్లడం ఏ మాత్రం ఇష్టం లేదు కానీ ఏం చేయగలను..


ఆరోజు తిరుపతి రైల్వే స్టేషన్ లో ఉండగా చిన్న కుర్రాడు సమోసాలు అమ్మడం చూసాను ..కాస్త ధైర్యం వచ్చింది అంతే అమ్మ చేతిని వదిలి పరుగు తీసాను.. అలా ఎంత దూరం వెళ్ళానో తెలీదు.


కనిపించిన లారీ ఎక్కి ఇలా హైదరాబాద్ వచ్చేశాను. తరువాత వాళ్ల గురించి పట్టించుకోలేదు. అప్పటినుండి ఇలా ఇక్కడ వాళ్లతో పరిచయం పెంచుకుని టీ లు అమ్ముతూ బతుకుతున్నాను.

ఆ గంట శబ్దం భయం మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంది.

తర్వాత అనాధ శరణాలయం మూతబడింది అని విన్నాను. ఇంకా అక్కడ చదువుకున్న నాలాంటి   అనాధలు ఒకరిద్దరిని కలవ గలిగాను. వాళ్లు కూడా పేదరికం లోనే ఉన్నారు కానీ నాలాంటి గంటల భయం మాత్రం వారికి లేదు.

నా కోరిక ఒక్కటే నాలాంటి అనాధల కోసం ఏదో ఒకటి చెయ్యాలి.. మానవత్వపు మాధుర్యాన్ని వాళ్లకి కూడా రుచి చూపించాలి ."

కళ్ళలో నీటిని ఆపుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు రాజు.

బహుశా నీ చరిత్ర ఏంటి అని తనని అడిగిన  మొదటి వ్యక్తి సురేషే ఏమో.


"నేను మాటిచ్చాను కదా నీ భయం పోగొడతాను. నిన్ను మామూలు మనిషిని చేస్తాను"


"సర్ హాస్పిటల్ కి వచ్చాం"

కారు పార్క్ చేసాడు డ్రైవర్.


" స్ఫూర్తి మానసిక వ్యాధి చికిత్సా కేంద్రం" తడుముకుంటూ చదివాడు రాజు .


"డ్రైవర్ నువ్వు ఇక్కడే ఉండు" అని చెప్పి రాజుని లోపలికి తీసుకెళ్లాడు సురేష్.

దాదాపు అరగంట సేపు డాక్టర్ తో మాట్లాడాడు.


"రాజు నువ్వు ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ కి సహకరించు, నేను సాయంత్రం వస్తా"

అని చెప్పి వెళ్ళిపోయాడు సురేష్.


" నీకు ఉన్న సమస్య పూర్తిగా తగ్గుతుంది నువ్వు మొత్తం ఐదు సార్లు హాస్పిటల్ కి రావాల్సి ఉంటుంది "

అని రాజు కి చెప్పి డాక్టర్ కాంపౌండర్ ని పిలిచి రాజుకి క్షవరం చేయించి కొత్త బట్టలు ఇచ్చి సిద్ధం చేయమని పురమాయించాడు.


*****


సాయంత్రం ఆరు గంటలు అయింది 

"ఎలా ఉంది రాజు నిన్ను గుర్తు పట్టలేక పోతున్నా తెలుసా"నవ్వుతూ అడిగాడు సురేష్.

" చాలా బాగుంది సార్ ఇప్పుడు" నవ్వుతూ చెప్పాడు రాజు.


"మళ్లీ నువ్వు వారం తర్వాత రావాలి పద మీ ఇంటి దగ్గర దింపే స్తా "


"నాకు ఇల్లు లేదు సార్'


' సరే నేను నీకు రూమ్ బుక్ చేస్తా నీకు ఏం కావాలన్నా అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉంటాయి ,నీకు ఒక ఫోన్ ఇస్తాను ఏం కావాలన్నా నాకు ఫోన్ చెయ్ అలాగే నన్ను మీరు అని పిలవకు సురేష్ అనే పిలు ఓకే నా"

రాజు కళ్ళలో ఓ మెరుపు నీరు గా కళ్ళ నుండి వర్షిస్తోంది.


" ఎందుకు మీరు నాపై ఇంత అభిమానం చూపిస్తున్నారు తెలుసుకోవచ్చా?"


"చెప్పాల్సిన సమయం వచ్చింది తప్పకుండా చెప్తా..

ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నారు. కనీసం బడికి కూడా పంపకుండా ఇంటి దగ్గరే ప్రైవేట్ పెట్టించి చదివించేవారు. ఎప్పుడూ ఏడవవలసిన అవసరమే నాకు రాలేదు. అలాగే పెద్ద చదువులు చదువుకుని పెద్ద ఉద్యోగం తెచ్చుకున్నాను అంతా బాగానే ఉంది కానీ సరిగ్గా ఐదేళ్ల క్రితం నేను ఇంటికి వెళ్తుండగా కారు చిన్న ట్రబుల్ ఇచ్చింది. డ్రైవర్ బాగు చేస్తుండగా ప్రక్కనే ఉన్న బడి నుంచి గంటల శబ్దం వినిపించింది .అది వింటూనే ఏదో తెలియని ఆందోళన, బాధ ఎందుకో అర్థం కాలేదు అప్పుడప్పుడు గుడికి వెళ్ళినప్పుడు కూడా గంటల శబ్దం ఇబ్బంది పెట్టేది ..సౌండ్ ఎలర్జీ అనుకున్నా కానీ ఈ బడి గంటలు ఇంకా ఎక్కువ బాధ పెట్టాయి ఆ తరువాత కొన్ని రోజులకు అదే దారిలో వస్తూ కావాలని ఆగాను. ఆ శబ్దం విన్నాను మళ్లీ అదే ఆందోళన ఎందుకో అర్థం కాలేదు. ఇక ఆగలేక పోయాను. అమ్మానాన్నల్ని అడిగాను అది మామూలే అన్నట్టు తీసిపారేశారు.. కానీ నేను వదల్లేదు నాలుగేళ్లు శోధించాను క్రిందటి సంవత్సరం ఈ ఆసుపత్రి డాక్టర్ భువనేశ్వర్ తో పరిచయం ఏర్పడింది. తద్వారా తెలిసిందేంటంటే ఆ గంటల శబ్దం నా చిన్నతనంలో నన్ను బాగా ఇబ్బంది పెట్టిందని కానీ అది ఎక్కడ ఎలా అని మాత్రం తెలుసుకోలేకపోయాను. ట్రీట్మెంట్ వల్ల నా సమస్య పరిష్కారం అయింది కానీ నాలో ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకలేదు అది నిన్ను కలిసాకే దొరికింది.."


"అంటే ??"


రాజు ముఖంలో వేయి సందేహాలు.


" అంటే నేను నీ లాగే నువ్వు నాలాగే అంతే.. అదే అనాథ శరణాలయం లో ఉన్న నన్ను ఐదేళ్లు ఉన్నప్పుడే మా అమ్మ నాన్న తీసుకొచ్చి పెంచుకున్నారు. బహుశా నేను ప్రారంభంలో గంటల శబ్దాలకి భయపడడం వల్లనేమో నన్ను బడికి కూడా పంపకుండా చదివించారు. వాళ్ళ ప్రేమాభిమానాల వల్ల నేను అన్ని భయాలకు దూరం అయ్యాను. నా తల్లిదండ్రులు క్రిందటి సంవత్సరమే చనిపోయారు వారు నాకు ఈ నిజం చెప్ప లేదు నాకు తెలియలేదు.. నేను నిన్ను హాస్పిటల్లో చేర్పించిన తరువాత నేను ఆ శరణాలయం ఉన్నచోటికి వెళ్లాను..

అది మూతపడినా అతని దగ్గర ఉన్న రికార్డులను బట్టి మే పది న నా తల్లిదండ్రులు నన్ను తీసుకొచ్చినట్టు ఉంది.

నా పుట్టిన రోజు కూడా అమ్మ నాన్న మే పది నే జరిపేవారు.

నా జీవితం అసలు కథని నాకు తెలిపావు నేనే నీకు రుణపడి ఉన్నాను.'


కాసేపు రాజు ఏమీ మాట్లాడలేదు 


"రాజూ అనాధ బాలల కోసం

ఏదైనా చేయడం నీ కోరిక అన్నావు అందుకు నీవు తగిన వాడివి.. నీకు పూర్తిగా తగ్గాక ఎంత కావాలన్నా ఇస్తాను అన్ని ఏర్పాట్లు చేస్తాను మనమే మంచి అనాధ శరణాలయం ఏర్పాటు చేద్దాం .."


రాజు కళ్ళల్లో హద్దులు లేని ఆనందం 

.

********


'ఇంటికి రాగానే ఏదో ముఖ్యమైన విషయం చెప్తా అన్నారు.."

భర్త చేతిలో సూట్ కేస్ తీసుకుంటూ అడిగింది ధరణి .


"ధరణి నీకు చాలా చెప్పాలి పద' ఆప్యాయంగా ఆమె భుజంపై చెయ్యి వేసి కారిడార్ లోకి తీసుకెళ్లాడు సురేష్.


    ******


" ఏదైనా మీ గతం తెలియడం మంచి విషయమే కానీ రాజుని నమ్మి కోట్ల రూపాయలు సాయం చేయడం..."


" నీకు ఇంకా చెప్పాలి ధరణి నేను రాజు ఆనాద శరణాలయం లో ఒకే రోజు చేరాం .. రోడ్డు పక్కన ఎవరో వదిలేసిన అనాధ కవలల్ని పోలీసులు తీసుకొచ్చి శరణాలయానికి అప్పగించినట్టు పేపర్ క్లిప్పింగ్ కూడా ఆ శరణాలయం యజమాని దగ్గర దొరికింది..

ఆ అనాధ కవలలం మేమే.. అంతేకాదు అక్కడ చదువుకున్న అనేకమంది పిల్లల్లో గంట శబ్దానికి భయపడింది ఒకేలా స్పందించింది కూడా మేమే.."


కాసేపు స్థాణువు లా ఉండిపోయింది ధరణి. 

"మరి ఎందుకు ఈ దూరం తనని కూడా వెంటనే తీసుకురండి మనతోటేఉంటాడు.." ఓదార్పు గా భర్త భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అడిగింది.


"కంగారు వద్దు ధరణి దానికి ఇంకా సమయం ఉంది సంపాదనకి నేనున్నాను సేవ చేయడానికి వాడు ఉండాలి .

వాడి ఆశయం పూర్తి కావాలి తను మానసికంగా ఇంకా సిద్ధపడాలి అప్పుడు చూద్దాం"


" అదే మంచిది"


అంటూ టీ తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది ధరణి.

అద్దంలో తన మొహం చూసుకుంటూ ఉండిపోయాడు సురేష్.


Rate this content
Log in

Similar telugu story from Inspirational