Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

గాయత్రీ పెండ్యాల

Drama

4.7  

గాయత్రీ పెండ్యాల

Drama

ఆమెకెందుకిచ్చినట్లు?

ఆమెకెందుకిచ్చినట్లు?

7 mins
4.3K



నా మనసు ఇప్పుడూ మౌనాన్ని కోరుతోంది. మంచికి చెడుకు మధ్య మూగగా మూలుగుతోంది. ఆవేదనో, ఆందోళనో తెలియక అల్లాడుతోంది. బాధో,బాధ్యతో తేల్చుకోలేక సతమతమవుతోంది.

ప్రస్తుతమున్నది దేవుని ఆలయంలోనేనైనా, నా పిచ్చి మనసును ఆయన వైపు మళ్లించ లేక పోతున్నాను.

ఎంత ఆలోచించినా బోధపడడం లేదు. ఈయన..ఆమెకీ ఎందుకు ఇచ్చినట్లు? చూడ్డానికి చక్కగా ఆరోగ్యంగా ఉంది. నీట్ గా తలదువ్వుకుని బొట్టు పెట్టుకుంది. పరిశుభ్రమైన చీర కట్టుకుంది. చూడ్డానికి ఏ లోటు కనిపించడం లేదు.

"అలా నిలబడిపోయి ఏం ఆలోచిస్తున్నావ్? ఆ అరుగు చెట్టు వద్ద దీపం పెట్టి వద్దాం దా!"

ఆయన పిలుపు చెవిన పడగానే అప్పటికి మనసును జోకొట్టి కాళ్లకు పని చెప్పాను.

    తరువాతి తరాలకోసం ధనాన్ని పోగేసి నట్టు, పుణ్యాన్ని కూడా వెనకెయ్యా లనుకుంటున్నారేమో!... గుడి లోపల వెలుపల, ప్రాంగణమంతా ఎక్కడ చూసినా జట్లుజట్లుగా జనం. ఇసుక కాదు నీళ్లు రాళ్లు చల్లినా తరిగేటట్లు లేరు. కాస్త ఖాళీ దొరికితే చాలు ఆ ప్రదేశాన్ని కడిగి, ముగ్గు వేసి గంధం పసుపు కుంకుమ చల్లి, ముగ్గు మధ్యలో ప్రమిద పెట్టి, నూనె నెయ్యి పోసి వత్తి వెలిగించి, పసుపును ముద్దగా కలిపి, గౌరమ్మను తీర్చి, తమలపాకు పైనుంచి, బొట్టు పెట్టి, పండ్లు పువ్వులు తాంబూలం కానుక అమ్మకు సమర్పించి, అగరవత్తులు వెలిగించి, అరటిపండ్ల నడుముకు గుచ్చి, కొబ్బరికాయ కొట్టి చిన్న వారుపోసి, కొన్ని వచ్చీరాని శ్లోకాల మధ్య కోర్కెల చిట్టాను గౌరమ్మకు నివేదించి, కర్పూరం వెలిగించి హారతి సమర్పిస్తూ, గంట గట్టిగా మోగించి, లేచి నిలబడి ఆత్మ ప్రదర్శన చేసి, ఈ పూజ జరగడం కోసం తెచ్చిన సామాగ్రి తాలూకు వ్యర్థ వస్తువులన్నీ, అక్కడే వదిలేసి, అవన్నీ గాలికి చెల్లాచెదురు అవుతుంటే, వాటిని అతి కష్టం మీద దాటుకుంటూ, శివయ్య దర్శనానికి వెళ్తున్నారు. ఆ జనసంద్రాన్ని దీపాల వరుస లను, వ్యర్ధాలన్నిటినీ దాటుకొని, అరుగు చెట్టు వద్దకు చేరేటప్పటికి పది నిమిషాలు పట్టింది.

  "ఇందాక మనం వచ్చినప్పుడు ఇంత జనం ఇంత చెత్త లేదు కదా!"అన్నాను

"మరి కార్తీకపౌర్ణమి అంటే ఏమనుకున్నావ్! ఇదిగో ఇటు చూడు, ఇక్కడ మూడు చెట్లు పెనవేసుకుని పెరిగి ఎంతగా విస్తరించాయో, ఈ చెట్ల చుట్టూ కట్టిన గుండ్రటి అరుగు, దాని వెనుక పెద్ద చెరువు, ఎంత ఆహ్లాదకరంగా ఉందో కదా ఇక్కడి వాతావరణం"అన్నారాయన

 అవును ఆ పిల్ల గాలి తనువును తాకగానే మనసు ఏదో పాటందుకుంది.

"ఓహో! పిల్ల మంచి ఊపు మీద ఉందే"అంటు ఆకుపై కర్పూర దీపం వెలిగించి, చెరువులోని నీళ్ళమీద వదులుతున్నారు. ఆ దీపాన్ని తదేకంగా  చూస్తూ

"కాసేపు కూర్చుందామా!"అన్నాను

   మనసు మళ్ళీ మూలుగుతోంది.ఆమెకి ఎందుకు ఇచ్చినట్లు అని ఆయన్ని అడగమంటోంది. తను కొబ్బరిచిప్ప పగలగొట్టుతూ

"ఓయ్ కొబ్బరి చిప్ప మొకం ఏంటి అలా ఉన్నావ్? కాస్త నవ్వితే సెల్ఫీ తీసుకుందాం"అన్నారు.

"అలాగే లే కొబ్బరి ముఖం ముఖం"అని నవ్వేసా.

"అబ్బా నవ్వింది రా నాగమల్లి పువ్వు"అంటూ మొబైల్ కెమెరా క్లిక్ చేశాడు.

"ఫోటో ఎలా వచ్చింది? కెమెరా ముఖం"అనగానే

"ఇద్దో చూస్తుండు సెల్ఫీ ముఖం, నేనెళ్ళి ప్రసాదం తీసుకువస్తా"అంటూ మొబైల్ నా చేతికి ఇచ్చి లేచారు.

 "నేను కూడా వస్తా"

అని హడావిడిగా పైకి లేస్తుంటే, నన్ను వెనక్కి నెట్టి కిందకు వన్గారు. ఏంటా అని చూస్తే! అరటిపండు.. ఇప్పటికే ఎవరి పాదం కిందో పడి సగం పగిలి గుజ్జు బయటికి వచ్చింది.

 "కింద చూసి కదా నడిచేది"

అంటూ దాన్ని తీసి ఒక పక్కన పడేశారు.

    ఏంటో! ఈ మనిషి పనులు.. ఒక పట్టాన అర్థం కావు. నాకు చిన్న నొప్పి తగలనివ్వరు. నన్ను అణువణువు గమనిస్తుంటారు. చాలా మంచోడని అనుకుందామంటే, అసందర్భంగా ప్రవర్తిస్తుంటారు.

    నిన్న సాయంత్రం పూజా సామాగ్రి కొనడానికి అని బజార్ కి వెళ్ళాము. కొన్ని కొన్నాక,పూలు పండ్లు తీసుకోవాలి అంటే, బైకు పండ్ల బండి దగ్గర ఆపారు. నేను పండ్లు తీసుకుని, ఆ పక్కనే తమలపాకులు కనిపిస్తే, అవి కూడా ఒక కట్ట తీసుకొని, బైక్ దగ్గరకు వచ్చేటప్పటికి, ఒక పెద్దసంచి బైకు హ్యాండిల్ కి తగిలిస్తున్నారు. ఏంటా అని చూద్దును కదా పువ్వులు... ఒక ఫంక్షన్ కి డెకరేట్ చేయడానికి సరిపోతాయి.

 "ఇన్ని ఎందుకు?"అన్న గొంతు పెంచి.

 "గుడికోయ్"అన్నారు.

 అభిషేకం చేయించుకుందాంమండీ అంటే! "అంత ఖర్చు ఇప్పుడు ఎందుకు చెప్పు, రేపు మనకి పాపో, బాబో పుట్టాక చేయించుకోవచ్చు"అన్నారు కదా.

ఇప్పుడు ఈ పువ్వులకు పెట్టిన ఖర్చుతో అభిషేకం జరిగిపోయేది.

"ఏంటలా రోడ్డు మీదే నిలబడి, ఎక్కడో ఆలోచిస్తున్నావు? ఎక్కి కూర్చో వెళ్దాం"అంటూ బైక్ స్టార్ట్ చేశారు. బజారులో భజాన బాగోదులే అనుకొని, మాట్లాడకుండా బైక్ ఎక్కి కూర్చున్న,

  ఇంటికెళ్లాక ఎప్పటిలాగే కొన్నవన్ని ఎక్కడివక్కడ సర్దేసి, కొన్ని పువ్వులు ఫ్రిడ్జ్ లో పెట్టి, ఒక తెల్ల గులాబీని, నా జడలో దూర్చి,

  "పూల పిచ్చి మొఖం"అంటూ నా పెదవులను ముద్దాడి

  "గుడి దాకా వెళ్ళొస్తా"అని చెప్పి వెళ్లిపోతుంటే ఇంకేం చేస్తాను. ఆయన ముద్దుకు నా కోపాన్ని అరువిచ్చేసి, మౌనంగా ఉండిపోయా. ఇవాళ గుడికి వచ్చి దర్శనం చేసుకునేటప్పుడు

  "చూడు మన పూలతో మంటపమంతా ఎంత చక్కగా అలంకరించారో!"అన్నారు.

 "ఆ! డబ్బు ఖర్చుపెట్టి తెచ్చిస్తే, ఎందుకు అలంకరించరు"అనుకొని

 " మ్ బాగుంది"అన్నాను నవ్వినట్టు పెదాలను సాగదీస్తూ.

 "ఓ పిల్ల!కాసేపు ఈ లోకంలోకి వచ్చి, ఇదిగో ఈ పులిహోర ప్రసాదం తిను."

 అంటూ పులిహోరను నా చేతికి అందించారు.

 ఎన్నేళ్ళ నాటిదో వేప చెట్టు, గుడి తూర్పు ప్రాంగణమంతా నీడనిస్తుంది. ఆ చెట్టు కింద కట్టిన అరుగు మీద కూర్చుని, ప్రసాదం తింటున్నాము. సుమారు ఏడెనిమిది ఏళ్ల వయస్సు ఉన్న ఓ పాప మా వద్దకు వచ్చి, చేయి చాపుతూ ముడుస్తూ

 "అమ్మ అమ్మ"అంటోంది.

 "బడి కి వెళ్తున్నావా?"అన్నారీయన

ఆ పిల్ల లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది.

 " సరే మేము బడిలో చేర్పిస్తాము మాతో వస్తావా!"రింగవుతున్న సెల్ఫోన్ను జేబులో నుంచి తీస్తున్నారు.

ఆ పిల్ల గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్లిపోతుంటే, నేను పిలిచి, అరటిపండు ఇవ్వబోయాను. నా వైపు ఓ చూపు విసిరి చివాలున వెళ్లిపోయింది.

 "మీరు రండి సార్ నేను గుడిలోనే ఉన్న" అంటూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు.

  ఏంటో ఈ మనిషి ఆ పిల్లకి ఒక ఐదు రూపాయలు ఇస్తే ఏం పోతుంది ఈయన సొమ్ము. పసి పిల్లలు దేవుని స్వరూపాలు అంటారే, అలాంటిది ఆ దేవుని కోసం అంతంత ఖర్చు చేస్తున్నారుగా. పాపం భయపడి పండు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయింది.

  అయినా ఇప్పటికి ఎన్నిసార్లు చూడలేదు, ఇంకా చిన్న పిల్లలు.. నాలుగు అయిదు ఏళ్ళు కూడా ఉండవు. ఆకలి బాధ తాళలేక, డిపోల్లో, రైల్వే స్టేషన్లలో చేయి చాచి అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళని కూడా ఇలాగే ఏవేవో ప్రశ్నలు అడిగి భయపెట్టి, వెళ్లగొడతారే కానీ రూపాయివ్వరు

  పాపం ఓ ముసలాయన, బాగా బక్కచిక్కి ఉన్నాడు. కదల్లేక కదులుతున్నాడు. ఇప్పటికీ రెండు దేవాలయాల్లో కనిపించాడు. ఎంత ప్రాధేయపడినా అతనికి ఏమి ఇవ్వలేదు. అందుకేనేమో ఉదయం మా ఇద్దరినీ చూసి, చేయి చాచకుండా అలా చూస్తూ నిల్చున్నాడు.

    గుడి ద్వారం వద్ద ఎందరు బిక్షగాళ్లున్నారు. మాసిన బట్టలు, మురికి కారుతున్న శరీరం, ముడులు గట్టిన జుట్టు, వాళ్లకేదైనా కొంచెం సాయం చేయొచ్చు కదా! ఇలాంటివన్నీ అడిగి వాదన పెట్టుకుందామంటే

"నీకెందుకు,

నీకేమైనా లోటు చేస్తున్నానా?"అని అంటారేమో!

 అది నిజమే. ఆయన ప్రేమ పాతికేళ్లు పెంచిన మా అమ్మానాన్నలను సైతం మరిపించింది. నాకేచిన్న బాధ కలిగినా మా అమ్మలా విలవిలలాడిపోతారు. ఏది కావాలని అడిగినా నాన్నల నిమిషాల మీద తీసుకువస్తారు. అంతటి ప్రేమమూర్తిని ఎలా నొప్పించను. ఆయన గురించి నేను చెడుగా అనుకోవడం ఏంటి. ఎవరో దారిన పోయే వాళ్ల గురించి నాకెందుకు ఇంత బాధ ఆందోళన?

   అయినా ఒకింత ఆలోచిస్తే నా అనే వాళ్ళు లేకనే కదా వాళ్లంతా ఇలా.. అడుక్కుంటూ బతుకుతున్నారు.నా భర్త అని వెనక్కేసుకుని రావడం కాకపోతే, ఇలాంటి అనాధలకు రూపాయి ఇవ్వని వాడు ఎంతో షో గా హుషారుగా ఉన్న ఆమెకెందుకు డబ్బులు ఇచ్చినట్లు? నేను కూడా సంపాదిస్తున్నాగా ఆయన అనుమతి కోసం ఎందుకు ఎదురు చూడాలి. వెళ్లేటప్పుడు గుడి బయట ఉన్న కొందరికైనా చిల్లర ఇచ్చి వెళతా. కాస్త పుణ్యం అయినా వస్తుంది పండగపూట.

    "ఓయ్ పిచ్చి పిల్ల! ఇదిగో కార్తీక పురాణం పుస్తకం తీసుకు వచ్చా."అంటూ పుస్తకాన్ని నాకు ఇచ్చేసరికి

ఆలోచనల్లోంచి తేరుకొని

 "ఇప్పుడిది ఎందుకు మన ఇంట్లో ఉంది కదా!"ఉక్రోషంగా అన్నాను.

"అబ్బో అమ్మాయిగారు ఏంటో కస్సుబుస్సులాడుతున్నారే"అన్నారు నా భుజంపై నిమురుతూ.

 "మనకున్న వస్తువు కోసం డబ్బు పెట్టడం ఎందుకు?"

నా భుజం మీద ఉన్న ఆయన చేయిని నెట్టేస్తూ అన్నాను.

  జాలిగా ముఖం పెట్టి

"అంత కోపం అయితే ఎలా తల్లి! మనకు ఉంది కదా ఎవరికైనా ఇచ్చేద్దాం"అన్నారు.

"అంతేలెండి మనకు ఉంది కదా మన ఇష్టానుసారం ఖర్చు పెట్టుకుందాం."అన్నాను

"మన కష్టార్జితం, మనం ఖర్చు చేసుకుంటున్నాం తల్లి, ఒకరి దగ్గర చెయ్యి చాచట్లేదు కదా"అనగానే

  "కనీస అవసరాలు తీరక నే, వాళ్లు చేతులు చాచి అడుకుంటున్నారని మీకు తెలియదా?"ఆయన కళ్ళలోకి చూస్తూ అన్నాను.

"పరీక్షలు రాయని వాడికి మార్కులు వేస్తే ఏమవుతుంది? బీటలు బారిన నేలలో విత్తనాలు చల్లితే ఏమవుతుంది?"అంటూ అసందర్భ ప్రశ్నలడుగుతూ ఉండగా, ఎవరో ఒక వ్యక్తి వచ్చి

 "ఇందాక కాల్ చేసింది మీరే కదా!"మా ఆయన్ని పలకరిస్తూ అన్నాడు.

"అవును సార్"అంటూ అతనికి షేక్హ్యాండ్ ఇచ్చి

"నేనిప్పుడే వస్తాను, కూర్చుని వుండు"అని చెప్పి అతనితో వెళ్లారు.

ఈయన పనులే అసందర్భం అనుకున్న మాటలు కూడా అలానే ఉన్నాయి. అడుక్కునే వాళ్లకి నాలుగు రూపాయలు ఇద్దామంటే, పొంతన లేని ప్రశ్నల పురాణం మొదలెట్టారు. అనుకుంటుండగా వచ్చి

"ఇక బయలుదేరు దామా తల్లి"అన్నారు.

"ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఎవరు?"అడిగాను.

"తర్వాత చెప్తా దా వెళ్దాం"అంటుంటే

 "మ్హు చెప్పందే రాను"మూతి ముడుచుకుంటూ అన్నాను.

"ఏంటిది చిన్నపిల్లల"చిరు కోపం ప్రదర్శించారు.

"చిన్న పిల్లలకు చిల్లర ఇద్దామంటే చిక్కు ప్రశ్న లేసింది ఎవరు?"అన్న

 "ఓ నువ్వు ఇంకా అదే ఆలోచిస్తున్నావా! సరే చెప్తా విను"అంటూ అరుగుపై బాసపట్టు వేసుకుని కూర్చున్నారు.

  

 "మనదేశంలో భిక్షగాళ్ల సంఖ్య రోజు రోజుకి ఎందుకు పెరిగిపోతుందో తెలుసా నీకు? ఇంత ప్రగతి సాధిస్తున్నప్పటికీ కూడా పనిచేయని వాడి పట్ల, జాలి చూపించి, పైసలు ఇవ్వడం, ఉచిత దానాలు చేయడం వలన. కటిక పేదవాడైన కష్టపడే తత్వం ఉన్నవాడు పని వెతుక్కుంటాడే తప్ప భిక్షమెత్తుకోడు. పుణ్యాన్ని సంపాదించాలనే స్వార్థంతో కొందరు ప్రజలు, పదవులు సంపాదించాలనే పేరాశతో కొందరు నాయకులు, దేశంలో భిక్షగాళ్ళు, సోమరిపోతుల సంఖ్యను వృద్ధి చేస్తున్నారు. పని చేసేవాడికే పైకం ఇవ్వాలి.ఏ పని చేయ లేని వాడికి చేయూతనివ్వాలి. బాధ్యత ఎరిగిన వ్యక్తులు పని చెయ్యకుండా ఫలితం ఆశించరు. ఇందాక వచ్చిన వ్యక్తి, ఎవరు అని అడిగావు కదా! ఆయన వృద్ధాశ్రమం మేనేజర్. ఉదయం మనం గుడికి వచ్చేటప్పుడు, బయట ఉన్న బక్కచిక్కిన ముసలాయను గమనించావు కదా"అనగానే

 నేనందుకొని " మ్ ఆయన్ని ఇంతకు ముందు రెండు మూడు గుళ్ళల్లో చూశాము కదా."అన్న

  "అవును వయసుడిగిన ఆయన తిప్పలు తప్పించడం కోసమే మేనేజర్ తో మాట్లాడి, వృద్ధాశ్రమంలో చేర్పించా"అంటుంటే

"నిజమా!"నా కళ్ళు పెద్దవి చేశాను.

 "పని చేయగలిగిన శక్తి యుక్తులు ఉండి కూడా, పిల్లల్ని పీక్కుతినే పెద్దవాళ్ళు, ఏదైనా సాధించగల సత్తా ఉండి కూడా, పెద్దల శ్రమతో సరదాలు తీర్చుకునే కుర్రవాళ్ళు, విధిని మరిచి లంచాలను భోంచేసే అవినీతిపరులు సంఘంలో దర్పం ప్రదర్శిస్తున్నప్పటికీ.. బిక్షగాళ్లు ముష్టి వాళ్లతో సమానమే కదా తల్లీ!"అని ఆయన అంటున్నప్పుడు

కార్తీక పురాణం పుస్తకం నా ఒడిలో నుంచి జారి పడబోతుంటే పట్టుకుని

"ఇది మన ఇంట్లో ఉన్న సంగతి నాకు గుర్తుంది, కానీ ఈ పుస్తకాలు అమ్ముకునే వ్యక్తికి రెండు కాళ్లు లేవు, అతనికి కాస్త సాయం చేసినట్టు ఉంటుందని కొన్నాను. నిన్న అన్ని పువ్వులు ఎందుకు కొన్నారని అడిగావుగా, ఆ పువ్వులమ్మె ఆమె మరుగుజ్జు మనిషి. అవయవాలన్నీ ఉన్న కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. కనీసం ఒక్క రోజైనా ఆమెకు చేయూతను అందించిన వాళ్ళం అవుతాము కదా అని పువ్వులన్నీ కొన్నాను. అభిషేకం చేయించినా ఫలితం ఇలా లభించిందని అనుకోవచ్చు కదా"అన్నారు.

నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు.

"ఇప్పుడైనా ఇంటికి బయలు దేరదామా" అంటూ లేచారు

  "వెళదాం కానీ, మరి"అంటూ నసిగాను.

 "ఇంకా ఏం అనుమానం మిగిలిపోయింది?"అంటూ ముఖం దిగాలుగా పెట్టారు.

 "ఇందాక పూజ అయిపోయి వచ్చేటప్పుడు, ఆమెకి ఎందుకు డబ్బులు ఇచ్చారు?"నేనడిగిన మాట పూర్తి కాకముందే

  "అటు చూడు, ఆమెకే కదా"అన్నారు

"అవును"బుంగ మూతి పెట్టి అన్నాను.

"ఆమె ఏం చేస్తోంది?"అనగానే విసురుగా ఆయన వైపు చూసి

 "నేనేం చిన్నపిల్లనా అలా అడుగుతున్నారు చిమ్ముతోంది"అన్నాను

"పూజ పూర్తి చేసుకొని మనం ఇవతలకు వచ్చేస్తే, అక్కడ ఎంత చెత్త పోగవుతుందో, ఎంత మురికి చేరుతుందో, నువ్వు చూసావు కదా! అదంతా తీసివేసి, శుభ్రం చేసి, తరువాతి పూజకు ఆ ప్రదేశాన్ని సిద్ధం చేస్తోంది ఆమె"

ఆయన మాట ఆగగానే కాస్త గోముగా

 "అందుకా ఆమెకి డబ్బులు ఇచ్చింది. నేను ఇంకా ఎందుకో అనుకున్నా లేండి."అన్నాను.

"నువ్వు కాక  మరెవరు అనుకుంటారు, ఎవరు ఆలోచిస్తారు తల్లి నా గురించి."అంటూ నా చేయి అందుకున్నారు.

ఇద్దరము అలా గుడి ద్వారం దాటి బయటకు నడుస్తూ ఉంటే

 "అమ్మ బాబు ధర్మం చేయండి" అంటూ ఓ పది గొంతులు అరుస్తున్నాయి.

"వీరందరూ పని చేయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళే, ఏ ఒక్కరిలోనూ అవయవ లోపం గానీ, బలహీనతలు గాని లేవు, కానీ ఇలా అలవాటు పడిపోయారు అంతే." అంటున్నారాయన ఇంతలో

"ఇందాక డబ్బులు ఇవ్వకుండా, అరటికాయ ఇవ్వబోయిందంటనే, అదిగో ఆ మహాతల్లే,ఆ బోడి కాయలైతే గుడి నిండా లేవు"అనుకుంటున్నారు ఇద్దరు పిల్లలు.

  "విన్నావా!"అన్నారాయన బైక్ స్టార్ట్ చేస్తూ.

వాళ్ల పరిస్థితికి జాలిపడాలో, ఆ పద్ధతి చూసి కోప్పడాలో అర్థం కాలేదు.

"ఉచితంగా లభించే వాటికి విలువ ఉండదు. అదే కష్టఫలం ఐతే కావలసినంత మేరకే ఉపయోగిస్తారు."అంటూ నన్ను బైక్ ఎక్కమన్నట్లు సైగ చేశారు

ఏది ఏమైనా మా ఆయన సమాజాన్ని చదివినంతగా, నేను చదవలేదేమో! ఇంతసేపు నా మనస్సునింత సంఘర్షణకు గురి చేశాను.



Rate this content
Log in

Similar telugu story from Drama