Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hitesh Kollipara

Drama Thriller

3.9  

Hitesh Kollipara

Drama Thriller

లవ్ ఇన్ అమెరికా - 1

లవ్ ఇన్ అమెరికా - 1

6 mins
811


#ఆరంభం.


ఒక్కసారిగా స్పృహ వచ్చి లేచి కూర్చున్నాను. గుండె అదురుతుంది. ఊపిరి ఆడుతుంది కానీ అంతకన్నా ఆయాసంగా ఉంది.

ఎక్కడున్నాను?... మొదటి ఆలోచన. తెలీలేదు.

ఏమైంది?.... రెండో ఆలోచన. అర్ధంకాలేదు.

చుట్టూ చూశాను. నెమ్మదిగా అర్ధమవసాగింది. చుట్టూ తెల్లటి గోడలు. ఆ గోడలకి సమాన దూరంలో మంచం. ఆ మంచం మీద నేను. నా ఎదురుగా కనిపిస్తున్న గోడ తొలచబడి ప్లస్ గుర్తులు వేసిన రెండు గ్లాస్ డోర్ లు బిగించబడి ఉన్నాయి. అర్ధమైంది. నేను ఐ‌సి‌యూ రూమ్ లో ఉన్నాను.

నా చేతులకి ఏవో ట్యూబ్ లు తగిలించారు. వాటిగుండా మంచం పక్కన స్టాండ్ కి తగిలించిన బాటిల్స్ నుంచి ఏవేవో ద్రవాలు నా శరీరం లోపలికి సరఫరా అవుతున్నాయి. ముక్కుకి ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. ఐతే తల బద్దలైపోతున్న అనుభూతి. వెంటనే చేత్తో నుదుటిని తడుముకున్నాను. చర్మం తగల్లేదు కానీ తలకి చుట్టిన బ్యాండేజ్ మాత్రం తెలిసింది.

మళ్ళీ అదే ఆలోచన – “ఏమైంది నాకు?’’ - ఈసారీ గుర్తుకు రాలేదు.

ముక్కుకి ఆక్సిజన్ మాస్క్ బరువుగా ఉన్నట్టు అనిపించి తీసి పక్కన పెట్టబోయాను. అప్పుడు గమనించాను చేతులకి ఎవరో రక్కినట్టు ఏవేవో గాట్లు, మచ్చలూ తేలి ఉన్నాయి. కాళ్ళకి కూడా. కానీ అవేమీ పట్టించుకోకుండా ఆక్సిజన్ మాస్క్ ని తీసి పక్కన పెట్టాను. చేతులకి తగిలించిన ట్యూబ్ లని కూడా తొలగించాను. ఒళ్లంతా సలపరంగా ఉంది. ఇంతలో వెనుక నడుం కింద నుంచి మెడ పై దాకా ఏదో జర్రిగొడ్డు పాకినట్టు నొప్పి పాకిన అనుభూతి.

‘’అమ్మా!...” పంటి బిగువన మూలిగాను.

అప్రయత్నంగా చేత్తో వెనుక తల భాగాన్ని స్పృశించాను. తడి తగిలింది. చూస్తే రక్తం!!

ఆ వెంటనే జరిగింది మొత్తం కళ్ళముందు ఫ్లాష్ లా మెదిలింది. భయంతో కళ్ళు మూసేశాను. మళ్ళీ జర్రిగొడ్డు నొప్పి.

“దేవుడా!...” ఈసారి పైకే అన్నాను.                        

ఆ జర్రిగొడ్డు నొప్పి వెన్నుని చీల్చేసేలా ఉంది. ఐనా ధైర్యం చేసి పాదాన్ని కింద పెట్టాను. డోర్ ని చేరి రూమ్ నుంచి బయట పడాలనేది నా ఉద్దేశ్యం. ఐతే కింద పాదాన్ని మోపిన మరుక్షణం నేల చల్లదనం వెన్నుని ఇందాక జర్రిగొడ్డు నొప్పికి మించిన గగుర్బాటుకి గురిచేసింది. తడబడుతూనే లేచి నించున్నాను. ఊపిరి బరువుగా వస్తుంది. పట్టించుకోకుండా డోర్ కేసి నడిచాను.

ఐతే డోర్ ని తెరవబోతున్నా అనే క్షణంలో వినిపించింది ఆ శబ్దం. కాగితం రెపరెపలాడుతున్న శబ్దం. అప్రయత్నంగా శబ్దం వస్తున్నకేసి తల తిప్పాను. మంచం పక్కన టేబుల్ మీద ఉన్న పూల బొకేల మధ్యలో ఉంది ఆ కాగితం. గాలికి రెపరెపలాడుతుంది. అప్రయత్నంగా దానికేసి నడిచాను. దగ్గరికెళ్తే తెలిసింది అది కాగితం కాదు ఫోల్డ్ చేసిన లెటర్ అని. ఒంగి మునివేళ్ళతో దాన్ని అందుకున్నాను. తెరవబోతూ అది ఉన్న బొకేకేసి చూశాను. ‘విత్ లవ్ ఫ్రమ్ ఆల్బర్ట్’ అని వ్రాసి ఉంది.

అంటే ఇది ఆల్బర్ట్ వ్రాసిన లెటర్?!                         

కానీ అతడు లెటర్ వ్రాయటం ఏంటి??

వెంటనే ఆల్బర్ట్ నా కళ్ళముందు మెదిలాడు.

ఆల్బర్ట్ గురించిన చిన్న ఆలోచన చాలు నా పెదాలు అర్ధచంద్రాకారంలోకి మారిపోతాయి. బుగ్గల్లోకి రక్తప్రసరణ అధికమయ్యి చెక్కిళ్లు ఎరుపెక్కుతాయి. అతడి ప్రతిరూపం నా మనోఫలకం అంతా నిడిపోయి అతడి జ్ఞాపకాలు నా కళ్ల ముందు కదలాడుతాయి. ఇదంతా కేవలం సెకన్ల వ్యవధిలోనే జరిగిపోతుంది. అంతటి గాఢముద్ర అతడిది నా మీద.

కానీ జీవితంలో మనం కొన్నికొన్నిసార్లు కొన్నికొన్ని విషయాల్ని ఇలా జరిగి ఉండాల్సింది కాదు అని అనుకుంటూ ఉంటాం. నావరకు నాకు అలాంటివాటిలో మొదటిది అమెరికాకి రావటం ఐతే, రెండోది ఆల్బర్ట్ తో ప్రేమలో పడటం.

అవును..., నేను ఆల్బర్ట్ ని ప్రేమించాను. ఎంతగా ప్రేమించాను అంటే నాకే తెలీకుండా నేను అతడి మీద ప్రేమని పెంచుకున్నాను. అతడు కూడా అంతే. నేనంటే చాలా ఇష్టపడేవాడు. ఎంత ఇష్టపడేవాడు అంటే మా ఇద్దరి మధ్య పరిచయం రెండు సంవత్సరాలే ఐనా, నేను జన్మతః తన దేశం కాకపోయినా ప్రతిఒక్కరికీ నన్ను తన బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేసేవాడు. ఐతే ఆ ‘బెస్ట్ ఫ్రెండ్’ హోదానే తరువాత నా ప్రేమకి అడ్డు వస్తుందని అప్పుడు నేను అనుకోలేదు. ఆ బెస్ట్ ఫ్రెండ్ హోదానే ఆరోజు అతడు అడిగిన సాయానికి ఒప్పుకునేలా చేస్తుందని ఊహించలేదు. ఆ బెస్ట్ ఫ్రెండ్ హోదానే ఇప్పటి నా ఈ స్థితికి కారణమవుతుందని అస్సలు ఊహించలేదు.

కానీ జీవితం అంటే అంతే. ఊహించినది నిజమైతే దాన్ని అదృష్టం అంటారు. జరిగేదాన్ని ఊహించలేకపోవటాన్నే విధి అంటారు. నాకు అదృష్టం లేదు. విధి మాత్రం నాతో అన్ని రకాల ఆటలూ ఆడుకుంది.

నిజానికి ఆల్బర్ట్ నా దగ్గర చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండేవాడు. పైగా ఎవరూ కూడా ఆల్బర్ట్ కి ‘కాదు’ అని చెప్పలేరు. నెలకోసారి సెల్ ఫోన్స్ ని మార్చినంత తేలికగా అతడు గర్ల్ ఫ్రెండ్స్ ని మారుస్తాడని తెలిసినా..., ఎంతోమంది గర్ల్ ఫ్రెండ్స్ ని రాత్రిళ్ళు తన రూమ్ కి తీసుకెళ్తాడని తెలిసినా..., రాత్రుళ్లు తాను ఆ అమ్మాయిలతో ఎలా గడిపిందీ వచ్చి పూసగుచ్చినట్టు వర్ణించి వర్ణించి మరీ చెప్పినా... ఆల్బర్ట్ కి ‘కాదు’ అని సమాధానం చెప్పలేరు. అతడి స్నేహాన్ని ‘వద్దు’ అని దూరం పెట్టలేరు. కనీసం నేను పెట్టలేను. అదే అతడి మ్యాజిక్!!

ఇక నువ్వు భారతీయ అమ్మాయివి ఐతే అమెరికాలో పరిస్థితులు కొంచెం విభిన్నంగా ఉంటాయి. నిజానికి మేము అమెరికాకి వచ్చేసి సంవత్సరాలు గడుస్తున్నా మా అమ్మానాన్నలు మాత్రం ఇంకా ‘భారతీయత’ అనే బాటిల్ లో ‘సంప్రదాయం’ అనే మూత కిందే బంధిపబడే ఉన్నారు. ముఖ్యంగా మా అమ్మ. ఆ కారణంగానే ఆరోజు ఆల్బర్ట్ ఎవరో అమ్మాయిని (పేరు తెలుసు కానీ ఆల్బర్ట్ ని ముద్దు పెట్టుకున్న అమ్మాయి పేరు పలకటం కూడా నాకు ఇష్టం లేదు) ముద్దు పెట్టుకుంటున్నప్పుడు చూసి మా అమ్మ నోరెళ్ళబెట్టేసింది. దూరం నుంచి నాకు చూపిస్తూ,

“ఛీ.. ఛీ.. చూడవే వాడు..., సిగ్గులేకుండా ఆ అమ్మాయితో ఏం చేస్తున్నాడో??...” అంది. మరుక్షణంలో, “తప్పు... అటువైపు చూడకు...” అంటూ నాకళ్లు మూసేసి నన్ను ఇటువైపుకి తిప్పేసింది. “...చూడూ” అంటూ చూడమనటం ఎందుకో మళ్ళీ “తప్పూ...” అంటూ వద్దనటం ఏంటో మా అమ్మ తీరు నాకు అర్దంకాలేదు.

కానీ ఒకటి మాత్రం నిజం. అప్పుడే నాకు ఆల్బర్ట్ అలా ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోవటం అస్సలు నచ్చలేదు.

‘’స్టూపిడ్’’ అదే అతడి మీద నా మొదటి భావన..

కానీ ఇవేవీ నన్ను ఆల్బర్ట్ తో ప్రేమలో పడకుండా ఆపలేకపోయాయి. సన్నటి ఆకారం, గ్రే కలర్ జుట్టు, టీ-షర్ట్ మీద విశాలమైన భుజాలు, ఆకట్టుకునే చరిష్మాతో అతడు అమ్మాయిల్ని అయిస్కాంతంలా ఆకర్షిస్తాడు. ఏదో మంత్రం వేసినట్టు అమ్మాయిలు కూడా వెళ్ళి అతడి ఒళ్ళో వాలిపోతారు. ఐతే ముందే చెప్పాగా ఆల్బర్ట్ నా దగ్గర చాలా ట్రాన్స్పరెంట్ అని.., అందుకే నేను ఖశ్చితంగా చెప్పగలను అతడు ఏ అమ్మాయికీ పడలేదు. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే - అతడు నాకు కూడా పడలేదు.

ఆయాసం బరువు పెరిగింది. గుండె వేగం హెచ్చింది. ఆలోచనల నుంచి తెరుకుని లెటర్ ని తెరిచాను. నా కళ్ళు సూలాల్లా అతడు వ్రాసిన వాఖ్యాలకేసి పరుగులు పెట్టాయి. అతడి అక్షరాలు చాలా అందంగా ఉన్నాయి. నిజానికి నాకు అతడి ప్రతిదీ అందంగానే అనిపిస్తుంది.

లెటర్ చదుతున్నంతసేపూ నా చెంపల మీద నిలిచి ఉన్న కన్నీళ్లు చదవటం పూర్తయ్యాక ఇక మావల్ల కాదన్నట్టు ఆత్మహత్య కోసమని నేల మీదకి దూకాయి. అందమైన అక్షరాల్ని అద్భుత పదాల రూపంలో వాఖ్యనిర్మాణం చేసి మనిషి మెదడుతో ఇంత క్రూరంగా ఆడుకోవచ్చా అనేలా ఉంది అతడి లెటర్.

“ఏంటి ఆల్బర్ట్ నువ్వు వ్రాసింది?”

నమ్మశక్యంగా లేదు. మళ్ళీమళ్ళీ లెటర్ ని చదివాను. అందులోని విషయం నాలోకి ఇనికేదాకా చదివాను. ఇనికాక నాకు నేను బ్రతికి ఉన్న శవంగా అయిపోయిన అనుభూతి. గుండెని కోసేస్తున్న భావన. ఇందాక వెన్నుని చీల్చేసేలా అనిపించిన జర్రిగొడ్డు నొప్పికన్నా వెయ్యిరెట్లు ఎక్కువ నొప్పి. కానీ ఈ నొప్పి శారీరక నొప్పి కాదు. మానసిక నొప్పి. బావోద్వేగపు నొప్పి. మనసు పొరల్ని చీల్చి, విడదీసి, అనువణువూ చొచ్చుకుపోయే నొప్పి. నన్ను ఈ ప్రపంచానికి దూరం చేసే నొప్పి. లెటర్ ని గుండెలకు హత్తుకుని వెనక్కి నడుచుకుంటూ గొడకేసి వెళ్ళాను.

“వద్దు లెటర్ లో వ్రాసింది నమ్మవద్దు. అతడి గురించి నీకు తెలుసుగా?... ఆల్బర్ట్ అబద్దం ఆడుతున్నాడు” నాలోని ఒక పార్శం వాదన.

“నీకేమైనా పిచ్చా!?... ఈ స్థితిలో కూడా ఆల్బర్ట్ అబద్దం ఆడతాడా?... అతడు వ్రాసింది నిజం” నాలోనే మరో పార్శం ఖండన.

నేను మాత్రం వాటి వాదనల మధ్య నిలబడలేనట్టు గోడవారగా కిందకి జారిపోయాను. ఉన్నట్టుండి ఊపిరి ఆడని ఫీలింగ్. గుండె నెమ్మదించింది. వెంటనే మంచం మీద ఆక్సిజన్ మాస్క్ కేసి చూశాను. లేవటానికి ప్రయత్నించాను కానీ లేవలేకపోయాను. ఆ ప్రయత్నాన్ని విరమించి కాళ్లని గుండెల దగ్గరగా తెచ్చుకుని తలని మోకాళ్ళ మధ్యలోకి దూర్చాను. ఊపిరి కోసం ఎగబీల్చసాగాను. ఐతే శ్వాసనాళంలో ఏదో మందమైన కఫం లాంటిది అడ్డుపడినట్టు ఉంది ఊపిరి అందటం లేదు. ఇంతలో బయట అస్పష్టంగా ఎవరివో స్వరాలు. అమ్మేనా?...

“అమ్మా......” అన్నాను.

ఐతే నా మాట నాకే వినిపించలేదు, ఇక బయట ఎక్కడో ఉన్న అమ్మకి వినిపిస్తుంది అన్న నమ్మకం లేదు.

ఇంతలో మళ్ళీ ఆల్బర్ట్ కళ్ళముందు మెదిలాడు. లేదు నేను ఓడిపోకూడదు. నేను బ్రతకాలి. చివరిగా ఆల్బర్ట్ తో ఒకసారి మాట్లాడాలి. అదే నిశ్చయంతో నేల మీదే మంచం కేసి పాకటానికి ప్రయత్నించాను. ఐతే బలం చాలక కుదరట్లేదు. నా మదిలో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. నా కళ్ళు మూసుకుపోతున్నాయి. ఐనా నా ప్రయత్నాన్ని మాత్రం విరమించలేదు. కొనసాగిస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఇదే నాకు తెలుసు – ఇప్పటి నా పరిస్తితి బ్రతకటమో లేక చావటమో అని, ఒకవేళ ఇప్పుడు బ్రతికినా తరువాత ఆల్బర్ట్ తో మాట్లాడాక ఖశ్చితంగా చావటమే అని.

“పప్పా....” ఈసారి అరిచాను. అట్లీస్ట్ అరిచానని అనుకున్నాను.

ఇందాకలాగే ఎవరూ రాలేదు. ఊపిరి అందక గుండె ఆగిపోయిన అనుభూతి. ఊపిరితిత్తులు కుంచించుకుపోతున్నాయి. శరీరం బయటా, లోపలా భరింపరాని విపరీతమైన బాధ. గొంతులో పోగుబడిన కఫాన్ని బలవంతంగా మ్రింగే ప్రయత్నం చేశాను. దిగలేదు. నేను చావటం తధ్యం అని తెలిసిపోతుంది. ఈసారి బయట నుంచి అమ్మానాన్నల మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. డాక్టర్ తో మాట్లాడుతున్నట్టు ఉన్నారు. నేను ఖశ్చితంగా బ్రతుకుతాను అని చెప్తున్నట్టు ఉన్నాడు డాక్టర్. ఇంత బాధలోనూ నవ్వొచ్చింది. నవ్వుతోపాటు ఎప్పుడో చుట్టాల్లో ఓ డాక్టర్ అన్న మాట కూడా గుర్తుకొచ్చింది.

“మా డాక్టర్లం అంతే..., మేము పేషెంట్లు ఎలాంటి స్థితిలో ఉన్నాసరే బ్రతుకుతారు అనే చెప్తామ్. ఆశని కలిగిస్తాం. నిజానికి అది ఆశ కూడా కాదు భ్రాంతి. ఎవరైనా జీవితంలో అత్యంత దుస్థితిలో ఉన్నప్పుడే హాస్పిటల్ లో వచ్చి చేరుతారు. అలాంటి సందర్భంలో ‘బ్రతుకు’ అనే బ్రాంతిని కలిగించటం బిజినెస్ టెక్నిక్కే ఐనా పేషెంట్లకీ, వాళ్ళ బంధువులకీ మానసిక స్థైర్యాన్ని మాత్రం ఇస్తుంది”

నవ్వాను. నవ్వు వెంటే మళ్ళీ బాధ. నొప్పి, బాధ పెరుగుతున్నకొద్దీ మృత్యుదేవత నా చెవుల్లో నాట్యం చేస్తున్న అనుభూతి. అటు మంచం, ఇటు డోర్ రెండూ కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న ఫీలింగ్. నాకు ఓడిపోవటం ఇష్టం ఉండదు. కానీ దేన్నీ చేరుకునే శక్తిలేదు. నేల మీదకి ఒరిగిపోయాను. వేడిగా ఉన్న నా బుగ్గ కింద నేలకి తగిలి ఈసారి దాని చల్లదనాన్ని మరింత అనుభూతింపజేసింది. కళ్ళు మూసేశాను. ఎదురుగా ఎవరో కనిపిస్తున్నారు.

ఆ ఎదురుగా ఉంది ఎవరో కాదు మృత్యుదేవత. ఐతే ఆమె ఊహించినంత భయంకరంగా ఏమీ లేదు. పైగా అందంగా ఉంది. విశాలమైన కళ్ళు, ఒంటి నిండా నగలు, ఒడ్డాణంతో పట్టుచీరలో లక్ష్మీదేవి అంత అందంగా, నిర్మలంగా ఉంది. నన్ను రారమ్మని చేతులు చాపి పిలుస్తుంది. ఆమె నవ్వుకే వెళ్ళి ఆమె చేతుల్లో ఒదిగిపోవాలని అనిపించేలా ఉంది. కానీ నాలో ఉన్న ఆల్బర్ట్ అనే ఆశ అందుకు ఒప్పుకోలేదు.

“లేదు.., నువ్వు పోరాడాలి. ఆమె ట్రాప్ లో పడకు...” అని అరిచింది.

వెంటనే కళ్ళు తెరిచాను. అంతా బ్లర్ గా తప్ప ఏం కనిపించట్లేదు. నేల మీద చలనం లేని నా శరీరం నా మనసుని పరిహసిస్తున్నట్టు అనిపించింది. చివరిసారిగా దగ్గి మళ్ళీ రెప్పలు వాల్చేశాను. ఈసారి చీకటి తప్ప మృత్యుదేవత కూడా కనిపించలేదు. కానీ చేతిలోని ఆల్బర్ట్ లెటర్ ని మాత్రం ఫ్యాన్ గాలికి ఎగిరిపోకుండా అలానే పట్టి ఉంచాను. పూర్తిగా స్పృహ కోల్పోయాను.

నేను ఆల్బర్ట్ ని కడసారి చూడగలనా?... అతడితో మాట్లాడగలనా??.. 


Rate this content
Log in

Similar telugu story from Drama