Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Varun Ravalakollu

Drama Romance Action

4.9  

Varun Ravalakollu

Drama Romance Action

గడిచిన క్షణాలు

గడిచిన క్షణాలు

7 mins
651


ఉదయం 6 గంటల నుంచి ఎదురుచూస్తుంటే ఇప్పుడు వచ్చింది మా ఊరి బస్సు, సమయం దాదాపుగా 9 గంటలవుతుంది, నా పేరు స్నిగ్ధ. M.Sc చదువుతున్నా. ఎగ్జామ్స్ పూర్తి చేసుకుని హాస్టల్ నుంచి ఇంటికి బయలుదేరాను. బయటకు అందంగా కనిపించే మా ఊరి బస్సులో రెండు మూడు సీట్లు మాత్రమే సరైన స్థితిలో వున్నాయి, ఆ రెండు మూడు సీట్ల కోసం నా కళ్ళు వెతికాయి. ఒక సీటు కనిపించింది కాని ఆ సీటులో ఏదో సంచి వుంది. ఎవరిదో తెలియదు కానీ ఎవరో సీట్ ‘రిజర్వు' చేయటానికి వాడారని ఆర్ధమైంది. కాని ఆ సీటు మాత్రమే మిగిలిన వాటికంటే శుభ్రంగా కనిపించటంతొ అక్కడే కూర్చోవాలని నిశ్చయించుకున్నాను, సంచిని చూడగానే నా బ్యాగ్ లో వున్న మొబైల్ గుర్తుకు వచ్చింది.

ఫోనులో సిరివెన్నెల రాసిన పాటలు వింటుండగా బస్సు తన ప్రయాణం ప్రారంభించింది. కొద్ది సేపటి తరువాత చూశాను, ఆ సంచి అక్కడే ఉంది, “అయ్యో!! ఎవరో బ్యాగ్ మరచిపోయారు” అంటూ కండక్టర్ కి చెప్పాను. కండక్టర్ వింతగా మొహం పెట్టి, “దాంట్లో బాంబ్ లేదు కదా” అంటూ సందేహంగా అడిగారు. ఆ సందేహానికి సంకెళ్ళు వేద్దామని సంచిని తెరిచి చూపించా అందులో వున్న పుస్తకం చూసి,

“పుస్తకమా! అయితే అక్కడే పడెయ్” అంటూ చిన్న చూపు చూశాడు. చదువుకునే వయసులో అవసరమైన పుస్తకం ఇప్పుడు పనికిరాని వస్తువైపోయిందన్న మాట ఆయన వయసుకి గౌరవం ఇస్తూ నా గొంతులో ఆగిపోయింది. ఆ సంచిని దానిలోని పుస్తకాన్ని పక్కన పెట్టి ఫోనులో పాటలు వింటూ వుండిపోయాను. ఇంతలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంటికి చేరడానికి మరికొన్నిగంటల సమయం పడుతుంది ఏంచెయ్యాలో అర్థం కాలేదు, ఆ పుస్తకం తలుపు తియ్యక తప్పలేదు! బయటనుంచి చూస్తే డైరీలా కనిపించింది కానీ తెరిచి చూస్తే అచ్చువేయబడిన పుస్తకం. ముందుమాట చదివే ఓపిక లేక రెండవ పేజీ చూశాను. అక్కడ రెండు కనుల మధ్య వున్న గులాభి పువ్వులను చూసి మాటలు కరువయ్యాయి అక్కడ ఉన్న “గడిచిన క్షణాలు” అన్న రెండు పదాలను చూసి ఇంతకీ ఏంటి ఆ క్షణాలు అన్న సందేహం వచ్చింది.

ఆ సందేహంతోనే చదవటం ప్రారంభించాను.

పుస్తకం లో:

కాలేజీ చదువు దాదాపుగా పూర్తయ్యింది. ఆ చివరి రోజుల్లో ఒక అందాన్ని చూశాను, మా కాలేజీలో చదువుతున్న అమ్మాయి కాదని అర్ధమైంది, ఎందుకంటే మా కాలేజీలో చదివిన అమ్మాయి అయితే నాకు కనిపించి వుండేది కదా! ఇంతకు ముందెప్పుడు ఆ అమ్మాయిని చూడలేదు మా కాలేజీకి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు, చాలా అందంగా వుంది, చాలా అన్న పదం కూడా సరిపోదు అన్నంత అందంగా వుంది,ఆ అందానికి చిరునామా తెలుసుకుందామనుకున్నాను,ఆ విధంగా తన వెంట కొన్ని అడుగులు వేసిన తరువాత తెలిసింది, తను మా కాలేజిలోనే చదువుతుందని, కాని కొన్ని కారణాల వల్ల పరీక్షలకు మాత్రమే హాజరవుతుందని. ప్రిన్సిపాల్ గారితో సంబాషణ ముగిసిన తరువాత బయటకు వచ్చిన ఆ అమ్మాయి వెంట నడుస్తున్న నన్ను గమనించి, అడుగుల వేగం పెంచింది. నాకు అర్థం కాలేదు,నేను వేగంగా నడుస్తూ తనని చేరుకున్నాను.

“ఏంటండి? నన్ను చూసి భయపడి పారిపోతున్నారు,” అన్న ప్రశ్నను ఎటువంటి మొహమాటం లేకుండా అడిగేశాను.

“లేదండి, త్వరగా ఇంటికి వెళ్ళాలి. అందుకే వేగంగా నడుస్తున్నా, ఐనా మీరు ఎవరో కూడా నాకు తెలియదు మిమ్మల్ని చూసి ఎందుకు భయపడతాను” అంటూ తేనెపలుకులను నా వైపు సంధించింది. ఆ మాటలకు సమాధానం నేను చెప్పలేక పోయాను. చెప్పవలసిన అవసరం కూడా లేదని నాకు నేనే సర్ధి చెప్పుకున్నాను. కొద్ది సేపటి తరువాత చూస్తే తను దూరంగా నడిచి వెళుతూ కనిపించింది. ఆ అమ్మాయి నడుస్తున్న దారిలో ఎటువంటి ఊరు లేదు, మా కాలేజీకి సంబంచిన లేడీస్ హాస్టల్ తప్ప. కొంతదూరం వరకు దారిలో కనిపించింది. ఖచ్చితంగా హాస్టల్లో ఉన్న అమ్మాయి అని అర్ధమైంది. ఇంతలో ఇంటి దగ్గర నుంచి ఫోన్ రానె వచ్చింది - అమ్మ!

‘ఇదిగో వస్తున్నా’ అంటూ బైక్ స్టార్ట్ చేసాను. ఇంటికి చేరుకోగానే అత్త కనిపించింది.

నాకు మా అత్తమ్మ అంటే చాలా ఇష్టం. ఇంట్లోకి వెళుతూనే

“అత్త, బాగున్నావా?” అని అడిగాను.

తను సమాధానం ఇవ్వకుండా “ఇలా మీ నాన్న ఇచ్చిన బంధుత్వంతో ఇంకా ఎన్ని రోజులు అల్లుడు” అని అడగనే అడిగింది.

సరదాగా అనుకుని నేను కూడా “పెళ్లే కదా అత్త, చేసుకుంటానులే తొందరెముంది” అని నవ్వుతూ సమాధానం ఇచ్చా.

సూర్యుడు నిదురపోయాడు,చంద్రుడు నిదుర లేచాడు, సమయం గడుస్తూ ఉంది, ఉదయం చూసిన అమ్మాయి గుర్తుకు వచ్చింది, అసలు మర్చి పోతే కదా!

ఆ వాలు కనులు మర్చిపోవాలన్నా మరువలేము. నలుపు రంగులో విరిసిన రెండు ఇంద్రధనస్సులు, రెండు కనులకు కనుబొమ్మలుగా అలంకరించబడ్డాయి. ఆ రేయి విరిసిన వెన్నెల తెలుపు, తెలుపు విలువ తెలిపిన చీకటి నలుపు రెండు ఆమె కనులలోనే దాగి పోయాయి. తన నుదుటన రోజుకో సింధూరంలా మారతామని ఒక్కో నక్షత్రం గొడవపడుతున్నాయి, ఆ రేయి వీస్తున్న చిరుగాలి తన శ్వాసలా అనిపించి, అమ్మాయిలతో తక్కువగా సంభాషించే నా మనసు తన గురించి మక్కువగా ఆలోచిస్తూ ఉండిపోయింది.

ఆ ఆలోచనల సాగరంలో విహరిస్తూ తలగడను గాలిలో విహరింపజేస్తూ అటలాడుతున్నాను. ఇంతలో ‘ఇంతకీ, ఆ అమ్మాయి పేరెంటి?’ అన్న సందేహం హృదయపు తలుపు తట్టింది. నిదుర కనుల వాకిలి దాటి ఎప్పుడో వెళ్లిపోయింది. ఆ సందేహం తీరక మునుపే ‘తను హాస్టల్ లో వుంటే రోజు కాలేజీకి ఎందుకు రావడం లేదు?’ అని మరో సందేహం వచ్చింది.

సమాధానం కోసం ఎంత ఆలోచించినా చిన్న ఆచూకీ కూడా లేదు, నిదురలేని రాత్రి గడిపిన నన్ను ఎవరూ నిదుర లేపవలసిన అవసరం లేదుగా! అందుకేనేమో ఉదయం కాగానే ఏ పనిలేకపోయినా త్వరగా తయారయ్యి కాలేజీకి చేరుకున్నా, ఎన్నిచోట్ల వెతికినా ఆ అందం జాడ కనిపించలేదు ఆ అమ్మాయి కోసం ఎదురుచూస్తూ మార్గమధ్యంలో నిలుచున్న నాకు వెనుకనుంచి ఏదో గాజుల శబ్ధం వినిపించింది.

వెనకకు తిరిగి చూస్తే అదే అమ్మాయి!

రోడ్డుకి అడ్డంగా నిలుచున్న నన్ను పక్కకి తప్పుకో మంటూ సైగ చేసింది.

ఆ అమాయకత్వం అందరికీ నచ్చుతుంది, అందులో అంత దగ్గరగా ఆ అమ్మాయిని చూస్తుంటే ఏదో తెలియని భావం కలిగింది. తన అధరపు కదలిక తనని బాధిస్తుందేమో అని మాట్లాడమని అడగలేక పోయాను, నా మనసు మాత్రం సంబాషణ కోరుతుంది, ఎక్కడికో తేలని ప్రయాణాన్ని మనసు ధీమాగా చేస్తుంది ఎందుకంటే అది తన వైపు వెళ్తుంది. అందుకే నోటి మాట దాచలేక “మీరు చాలా అందంగా ఉంటారండి” అనేశాను!

అంతే..............!

చిరునవ్వు సమాధానంగా వస్తుంది అనుకుంటే చిరుకోపం సమధానంగా వచ్చింది. దారి మధ్యలో దారి తెలియని బాటసారిగా నిలబడి పొయా కానీ పక్కకి తప్పుకోలేదు, అక్కడే అడ్డంగా నిలబడ్డాను. ఆ చందమామను నా కనులాకాశం విడువనని గొడవ చేస్తుంది మరి!

“అమ్మాయి అందంగా కనిపిస్తే అడ్డంగా నిలబడమని ఎవరైనా చెప్పారా!!”అని వ్యంగ్యంగా అడిగింది ఆ అమ్మాయి.

“లేదండి అలా ఎవరు చెప్పలేదు, కాని తాజ్ మహల్ ని చూస్తే అలాగే చూస్తూ ఉండిపోతాం కదా, ఇది అంతేనేమో” అన్నాను చిన్నగా.

“అవునా!! 100 సార్లు చూసిన తరువాత తాజ్ మహల్ ని చూసి కూడా వెంటనే వెళ్లిపోతారు కదా. మరి నన్ను చూసి కూడా అలానే వెళ్లిపోతారేమో ఆలోచించండి” అని సమాధానం ఇచ్చింది. తన మాటలు విని ఆశ్చర్యపోయాను...ఒక నిమిషం తరువాత “ప్రతి ప్రశ్నకి సమాధానం ఉన్నట్టే, ప్రతి పొగడ్తకి విమర్శ ఉంటుంది, మాట్లాడటం మాక్కూడా వచ్చు” అని నవ్వుతూ వెళ్లిపోయింది. ఆ నవ్వుకు మతి చెడింది. మది కదిలి ప్రేమ కడలి దరిచేరింది, కానీ నా సందేహాలు మాత్రం తీరలేదు. నా మాటకు మాట సమాధానం చెప్పగల అమ్మాయి, అందులోనూ అందమైన అమ్మాయి కనిపించింది. కానీ తన పేరు మాత్రం తెలుసుకోలేక పోయాను. కొంచం బాధగానే వుంది..’ఛ!’ అని నిరాశతో నిండిన ఒక శ్వాస తెలియకుండానే బయటకి వచ్చేసింది. ఎలాగైనా తన పేరు తెలుసుకోవాలి అని నా మనసుకు నేనే చెప్పుకుని కాలేజీ దగ్గర వెయిట్ చేస్తూ నిలబడ్డాను. కాలం తెలియకుండానే గడిచిపోయింది.

సమయం సాయంత్రం 4 గంటలయ్యింది. ఇంతలో ప్రిన్సిపాల్ కారు సరాసరి నా ముందు వచ్చి ఆగింది. కార్ డోర్ తీసి “ఏంటి కిరణ్ ఇక్కడ నిలబడ్డావ్” అని ప్రిన్సిపాల్ గారు అడిగారు.

“ఏం లేదు సర్, కాలేజీ రోజులు గుర్తుకు వచ్చి ఇలా వచ్చాను”

“అవునా!! నేనే నీకు కబురు చేద్దాం అనుకుంటున్నాను. నీకు ఈ ఇయర్ బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ ఇవ్వాలి అని నిశ్చయించాం. నువ్వు ‘కాలేజీ యాన్యువల్ డే’ కి తప్పకుండా రావాలి”.

ఇంతలో నేను ఎవరికోసమైతే కాలేజీ దగ్గరకు వచ్చానో ఆ అమ్మాయి అటుగా వెళ్తూ కనిపించింది, ప్రిన్సిపాల్ గారు ఆ అమ్మాయిని చూసి,

“కుసుమ ఇటు రా”అని పిలిచారు, తరువాత చాలా సేపు మాట్లాడారు, కాని వాటిలో నేను వినాలి అనుకున్నవి మాత్రమె నాకు వినిపించాయి!

తన పేరు “కుసుమ” అని, తను నా క్లాస్ మెట్ అని, కానీ కాలేజీకి రావడం కుదరక కేవలం పరీక్షలకు మాత్రమే హాజరవుతుందని.

‘అంతే కదా ప్రిన్సిపాల్ గారు, ఈ అమ్మాయి రోజూ కాలేజీకి వస్తే నేను మాత్రం తప్పకుండా ఫెయిల్ అయ్యేవాడిని’ అని నాలో నేనే అనుకున్నా, కానీ తను కొన్ని పరీక్షలు రాయలేదని ప్రిన్సిపాల్ మాటల్లో అర్థమయింది. ఇంకా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ “కుసుమకి కొన్ని సబ్జెక్ట్స్ అర్థం కాలేదట. నీకు ఖాళీ సమయం వుంటే నువ్వు చెప్పు కిరణ్” అంటూ బాధ్యత నాకు అప్పగించారు. బాధ్యతను కూడా వరంగా పొందవచ్చని నాకు అపుడే అర్థం అయింది!

“సరే సర్” అంటూ నేను చెప్పగానే ప్రిన్సిపాల్ వెళ్ళిపోయారు. హృదయానికి రెక్కలు వచ్చాయి, విహరించడానికి ఆకాశం సరిపోదు ప్రేమప్రపంచం కావాలి అనిపించింది.

వెంటనే “మీకు ఏమైనా సందేహాలు వున్నాయా కుసుమా? వీలుంటే ఇప్పుడు చెప్పనా!” అని అడిగాను.

కుసుమ నవ్వుతూ “మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా?” అని సూటిగా అడిగింది,

“నేను మీకు చెప్పవల్సింది సబ్జెక్టులో సందేహాలు మాత్రమే మీరు జీవితం గురించి అడుగుతున్నారు, ఎందుకు అలా అడుగుతున్నారు కుసుమ గారు” అన్నాను.


“గారు వద్దు, కుసుమ అని పిలిస్తే చాలు... నాకు కొంచం పని వుంది మీరు రేపు ఖాళీనే కదా, రేపు చెప్తారా?” అంటూ ముద్దుగా అడిగింది.

“రేపు నాకు కొంచం వేరే పని ఉంది. వీలు కాదు” మనసు వద్దంటున్నా కాస్త బెట్టు నటిద్దామని సాహసం చేశాను!

“నొ ప్రాబ్లం కిరణ్! అయితే 15 రోజులు తరువాత కలుద్దాం. నేను మా ఊరికి వెళ్తున్నా” అంది.

‘అయ్య బాబోయ్..ఏంటిది!’ అనుకుని “పనంటే పెద్ద పనేం కాదండీ..రేపు కలుద్దాం” నిజం చెప్పేశా!

వెంటనే తను విసిరిన కను సైగకు మది కదిలి ప్రేమ కడలి చేరింది. తను ఎందుకు అలా చూసింది అని ఆలోచిస్తూ నిలుచున్నా, తన చూపులు సరదాగా వున్నాయి కాని తన మనోభావం మాత్రం అర్థం కాలేదు.

కొద్ది సమయం గడిచాక “నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను పుట్టింది పెరిగింది ఈ ఊరే” అంటూ చిన్నగా నవ్వింది, దూరమైన మది కుసుమను చేరిందని అర్ధమైంది. ఆ సాయంత్రపు సమయంలో తనతో నడిచిన అడుగులు మరచిపోవడం సాధ్యంకాదు, ఆ కొద్ధి సంభాషణ సరిపోలేదు ఇంకా మాట్లాడాలి అనిపించింది. కాలేజీ దగ్గరకు మళ్ళీ వెళ్లాలనిపించింది కుసుమ అక్కడే ఉంటుంది అనుకుని బయలుదేరాను, కాని కుసుమ అక్కడ లేదు, ఏం చెయ్యాలో అర్థం కాలేదు, కాలేజీలో పనిచేసే వాళ్ళని కూడా అడిగిచూశాను. కానీ తను కనిపించలేదని చెప్పారు, తప్పక, మనసొప్పక లేడీస్ హాస్టల్ దగ్గరకు వెళ్లవలసివచ్చింది. గేట్ దగ్గరకు వెళ్ళగానే చాలా మంది అమ్మాయిలు కనిపించారు. అందరూ వింతగా చూస్తుంటే సిగ్గెసింది. వారిలో నాకు తెలిసిన అమ్మాయి కూడా ఉంది తనను పిలిచి కుసుమ గురించి అడిగాను

తను “కుసుమ ఇంకా రాలేదు కిరణ్. తను ఒక సూపర్ మార్కెట్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తుంది” అంది.

“తను రోజూ ఈ సమయానికి వస్తుంది కదా!” అని అడిగితే..

“ఏమో నాకు తెలియదు” అంటూ పెదవి విరిచి, “అయినా కుసుమ నీకు ఎలా తెలుసు? ఏంటి సంగతి” అంటూ వింతగా మాట్లాడటం మొదలు పెట్టింది.

“ఏమి లేదు తనకి సందేహాలు వుంటే ప్రిన్సిపాల్ చెప్పమన్నాడు అందుకే” అని చెప్పి రెండు అడుగులు వెనుకకు వేశా, ఇంతలో ఎదురుగా కుసుమ!

“ఎక్కడికి వెళ్ళారు కుసుమ” అని నేను అడిగాను తడబాటు లేకుండా!!,

“విడిపోయిన నదిని, ఎడారిని కలపడానికి వెళ్ళాను గురువుగారు” అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చింది. అది విని ఫక్కున నవ్వింది రాణి, కుసుమ సమాధానం నాకు నచ్చింది కానీ రాణి నవ్వునాకు నచ్చలేదు అందుకే రాణికి గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకున్నా! నాలో నిదురపోతున్న కవిని ప్రేమ సముద్రంలో తడిపి నిదుర లేపక తప్పలేదు. ఆ రాణి నవ్వును ఖండించాలి కుసుమని ప్రేమతో జయి౦చాలి ఎలాగైనా.......

కుసుమ ఇచ్చిన సమాధానానికి బదులుగా “దగ్గరవ్వాలనుకుంటున్న వాటిని నువ్వు కలుపవలసిన అవసరం లేదు. దూరంగా వుంచాల్సిన వాళ్ళని దగ్గరికి రానివ్వవలసిన అవసరం లేదు” అన్నాను.

నా మాటలు చేరాల్సిన గమ్యం చేరాయి,రాణి నవ్వు ఆగి౦ది. తను ఎంతదూరంలో వుండాలో అర్థంచేసుకుని హాస్టల్లోకి వెళ్ళిపోయి౦ది. కుసుమ మాత్రం తన మదిలోని మాట నా నోట విన్నట్టుగా శిలలా నిలిచిపోయింది.

వెళుతూ వెళుతూ కుసుమని పిలిచాను. ‘చెప్పు కిరణ్’ అంది.

“డౌట్స్ ఎమైనా వున్నయా?” అంటూ ప్రశ్నించాను.

లేదు అన్నట్లు తల ఊపింది.

“ఇప్పుడు చెప్పిన దాంట్లో కాదు! సబ్జెక్టుకి సంబందించి ఏమైనా వున్నాయా?” అని అడగాగానే నవ్వుతూ,

“ఉన్నాయి కిరణ్, చాలానే ఉన్నాయి. క్లాస్ రూమ్ నెంబర్ 79 ఖాళీగా వుంది. అక్కడ చెప్తావా? బోర్డు మీద రాస్తూ చెప్పగలవా?” అంది.

“బోర్డు మీద ఎందుకు? ఇక్కడే చెప్తాను?” అన్న నా మాటకు

‘కన్నుల భాషలు నేను అర్థం చేసుకోలేను మనసుతో చెప్పగలవా’ అన్నట్లు చూసింది.

అర్థం కాని చూపులకు అర్ధవంతమైన సమాధానం చెప్తూ కనులతో నవ్వాను, అంగీకారం కొద్ది సెకోండ్లలోనే చేరింది. ఇద్దరం కలిసి క్లాస్ రూమ్ నెంబర్ 79కి వెళ్ళాము. సంభాషణలో ఎన్నో అడుగులు, ఏడు అడుగులతో సమానం అయ్యాయి, మాటలన్నీ స్వరాలై ప్రకృతిలో కలిసిపోయాయి. వినిపిస్తున్నది రెండు మనసులు హృదయశబ్ధంతో పాడుతున్న ప్రేమగీతమే,ఆ ప్రేమ గీతపు భావం మాటలకందని మాధుర్యమనే చెప్పాలి. రూమ్ నెంబర్ 79ని చేరుకున్నాను, మా కాలేజిలో రూమ్ డోర్ దగ్గరకు బోర్డు కనిపిస్తుంది, రూమ్ దగ్గరకు వెళ్ళగానే ‘ఐ లవ్ యు కిరణ్’ అని బోర్డు మీద రాసి వుంది.

దాన్ని చూసిన తరువాత నా సంతోషానికి హద్దులు లేవు, అప్పటి వరకు నేను చెప్పాలనుకున్న మాటలు తను బోర్డు మీద రాసిందని నాలో నేనె మురిసిపోయాను, కుసుమ నేరుగా చెప్పడానికి సిగ్గుపడి బోర్డు మీద రాసిందేమో అనుకుని, కుసుమని అక్కున చేర్చుకుందామని తన వైపు చూసా.

కుసుమ మాత్రం కనక దుర్గమ్మ నేత్రాలు అరక్షణం అప్పుగా తెచ్చుకున్నట్లు చూసింది, నా సంతోషం సిక్సర్ కొట్టిన బంతి దారి తప్పి ఫీల్డర్ చేతికికి చిక్కినట్లు మాయమయింది. మౌనాన్ని ఎవరో ఒకరు వీడక తప్పదని “ఎందుకు కుసుమ కోపంగా చూస్తున్నావు” అని అడిగాను.

“ఎవరు బోర్డు మీద అలా రాసింది?” అని కోపంగా అడిగింది కుసుమ.

***


Rate this content
Log in

Similar telugu story from Drama