Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hitesh Kollipara

Drama Romance

4.2  

Hitesh Kollipara

Drama Romance

లవ్ ఇన్ అమెరికా – 5

లవ్ ఇన్ అమెరికా – 5

7 mins
611


#ప్రేమిస్తే_చెప్పాలి


మార్గరేట్ నామీదకి చేతిలో ట్రాలితో దూసుకువస్తుంది. అప్పుడు, “ఓ.. వోవోవో.... కామ్ గయ్స్...” అంటూ మా మధ్యలోకి దూరాడు ఆల్బర్ట్.

“ఆల్బర్ట్..., నీ ఫ్రెండ్ ని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమను” అన్నాను.

“ఆల్బర్ట్..., ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు గెట్ ఔట్ ఆఫ్ అవర్ కంట్రి” అది అరిచింది.

“ఏంటే నేను మీ కంట్రి వదిలి వెళ్ళేది?.. గట్టిగా మాట్లాడితే నిన్ను ఈ భూమ్మీదే లేకుండా చేస్తా...” నేనూ అరిచాను.

“సీ ఆల్బర్ట్..,, షి ఈజ్ థ్రేఠ్నింగ్ మి?”       

మేము ఇలా అరుచుకుంటూ ఉన్నా విచిత్రంగా అక్కడ తిరుగుతున్న జనాలు ఎవరూ మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు.

“హొ మార్గరేట్..., కామ్ గర్ల్” ఆల్బర్ట్ ఆమె వైపుకి తిరిగి ఆమెకి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.

“ఐ యామ్ నాట్ థ్రేఠ్నింగ్ యు…, ఐ మీన్ ఇట్” నాకు మాత్రం తగ్గాలనే ఆలోచనే ఏ కోశానా లేదు.

ఇక ఆల్బర్ట్ ఆలస్యం చేయలేదు. వెంటనే నా రెక్క పట్టుకుని అక్కడ్నించి పక్కకి తీసుకెళ్ళాడు.

“హేయ్..., మగ్..., సీ…” ఆల్బర్ట్ ఏదో చెప్పబోయాడు. పట్టించుకోకుండా, “మీ ఫ్రెండ్ ఏంటి పిచ్చిపట్టినట్టు మాట్లాడుతుంది?” అన్నాను. అతడి మాటలు వినే ఉద్దేశం కూడా నాకు లేదు.

“లిసెన్ గర్ల్...,” నిస్సహాయపు అసహనంగా అన్నాడు ఆల్బర్ట్.

నేను కామ్ అయిపోయా.

“గుడ్ నవ్ లిసెన్! యాక్చువల్లి మార్గరేట్ ఎందుకు అలా మాట్లాడుతుందో అర్ధకావట్లేదు. నిజానికి తను మంచిదే. బట్ అమెదో తన బ్రదర్ జాబ్ పోయిన ఫ్రస్ట్రేషన్ లో అలా మాట్లాడుతున్నట్టు ఉంది. జస్ట్ ఇగ్నోర్ హర్. నేను తనతో మాట్లాడతాగా?” అన్నాడు.

ఆల్బర్ట్ మాట్లాడుతున్నప్పుడు నేను ఆమె వంకే చూస్తూ ఉన్నాను. దూరం నుంచి మమ్మల్నే చూస్తూ ఉంది అది. దాని చూపులు తినేసేలా ఉన్నాయి.

“అండ్ థాంక్ యు మగ్..., లుక్స్ లైక్ యువర్ లాజిక్ హావ్ వర్క్డ్” అతడు కొనసాగించాడు.

 అర్ధంకానట్టు అతడి ముఖంలోకి చూసాను. అతడు చెప్పుకుపోతున్నాడు.

“అవును మగ్..., మార్గరేట్ నువ్వు పరిచయం కాకముందు నుంచే నాకు తెలుసు. ఇన్ఫాక్ట్ చిన్నప్పటినుంచి తెలుసు. అండ్ ఆల్సో, తను నాకు ఒన్ ఆఫ్ ద అర్లి క్రషస్ టూ. బట్ ఏదో కారణంగా బ్రేకప్ అయిపోయాం. అండ్ షి లెఫ్ట్ ఫర్ న్యూజెర్సీ. ఈమధ్యనే మళ్ళీ సిటికి వచ్చింది. మేబీ ఐ కుడ్ ట్రై హర్ వన్స్ అగైన్? వాట్ యు సే??”

ఆల్బర్ట్ ఉద్దేశం అర్ధమైంది. కానీ అర్ధంకాకపోతే బావుండని ఉంది. అభావంగా ముఖం పెట్టాను.

“డోంట్ బీ డంబ్ గర్ల్! మేబీ నా సోల్ మేట్ మార్గరేటేనేమో?..., అందుకే నువ్వు నన్నిక్కడికి తీసుకొచ్చావేమో?..., హూ నోస్?! ఓకే ఓకే. నువ్వు ఇంటికి వెళ్లిపో. నేను తనతో కలిసి షాపింగ్ చేస్తా. కనుక్కుంటా తను ఇప్పుడు ఎవరితోనైనా డేటింగ్ లో ఉందేమో. ఓకే బై” నా స్పందన గురించి చూడకుండా చెప్పేసి అమెవైపు అడుగులు వేశాడు ఆల్బర్ట్.

“కానీ ఆల్బర్ట్....” నేను పిలుస్తున్నా పట్టించుకోకుండా, “ప్లీజ్ గర్ల్..., అండర్స్టాండ్ మీ. ఐ విల్ టాక్ టు యు ఓవర్ ఫోన్” ఫోన్ లో మాట్లాడుకుందాం అన్నట్టు సైగలు చేస్తూ ఆమెని చేరుకున్నాడు. ఆమెతో ఏదో అన్నాడు. ఆమె నావైపు ఓ దిష్టిబొమ్మ లుక్ ఇచ్చి ఆల్బర్ట్ చేతికి తన చేతిని లాక్ చేసింది.

దానికి వేషాలు ఎక్కువయ్యాయి!

ఇద్దరూ జస్ట్ మ్యారీడ్ కపుల్స్ అన్నట్టు మాల్ లోపలికి వెళ్లారు. ఆల్బర్ట్ నన్ను వెళ్లిపోమన్నా వెళ్లకుండా నేను కూడా మాల్ లోపలికి వెళ్లాను. అది ఆల్బర్ట్ ని మాల్ లో అన్ని చోట్లకి తిప్పుతుంది గాని ఒక్కటికి కూడా కొనట్లేదు. ఆల్బర్ట్ కి స్వతహాగా షాపింగ్ అంటే కొంచెం బోర్. అయినప్పటికీ దాని నుంచి విషయాలు రాబట్టటానికి దాంతో తిరుగుతున్నట్టు అతడి ముఖం చూస్తేనే అర్ధమైపోతుంది.

లేకపోతే అలా నాకు అనిపిస్తుందా!?

ఏదేమైనా వాళ్ళ మాటలు మాత్రం నాకు వినిపించట్లేదు. నా చూపులు వాళ్ళ వీపుకి తగులుతున్నట్టు ఉన్నాయి, అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తున్నారు వాళ్ళు. ఆ సమయంలో నేను పక్కకి తప్పుకుంటూ వాళ్ళకి కనపడకుండా జాగ్రత్త పడసాగాను. రెండుగంటలు షాపింగ్ చేశాక చివరికి ఓ డ్రస్ ని సెలెక్ట్ చేసింది అది. ట్రైల్ రూమ్ కి వెళ్ళి చెక్ చేసుకో అన్నట్టు ఉన్నాడు ఆల్బర్ట్, ట్రైల్ రూమ్ వైపు అడుగు వేసింది. ఇంతలో ఏదో గుర్తొచ్చినాదానిలా వెనక్కి తిరిగి ఆల్బర్ట్ కాలర్ ని దొరకబుచ్చుకుని ఆల్బర్ట్ ని కూడా ట్రైల్ రూమ్ లోకి లాక్కుపోయింది. మరుక్షణం డోర్ మూసుకుపోయింది.

వాట్ ద ఫక్ ఈజ్ హపెనింగ్?!

ఒక్కసారిగా క్రుంగుబాటు వచ్చేసింది నాకు. తెలీకుండానే కళ్ళలోంచి దారాళంగా నీళ్ళు వచ్చేశాయి. ఇంకక్కడ ఒక్క క్షణం కూడా నిలబడటానికి నా కాళ్ళు సహకరించలేదు. పరిగెట్టుకుంటూ బయటికి వచ్చేసి కార్ లో కూర్చున్నాను. కార్ ని టర్న్ చేసి ఇంటి వైపుకి పోనిచ్చాను. డ్రైవింగ్ చేస్తున్నా అన్నమాటే గాని నా మెదడులో అన్నీ వాళ్ళ ఆలోచనలే.

వాళ్ళిద్దరూ ట్రైల్ రూమ్ లో ఏం చేస్తున్నారు?... అసలు నేను ఆల్బర్ట్ ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను?... సోల్ మేట్ ని వెతకటానికి కదా!... కానీ ఆల్బర్ట్ కి సోల్ మేట్ దొరికితే నాకే కదా నష్టం?... మరెందుకు తీసుకొచ్చాను?... ఎందుకంటే ఆల్బర్ట్ సాయం అడిగాడు కాబట్టి!... అతడికి సాయం చేస్తే సంతోషిస్తాడు కాబట్టి!... అతడి సంతోషమే నా సంతోషం కాబట్టి!... పిచ్చిదానా!... పిచ్చిదానా!... నన్ను నేను తిట్టుకున్నాను. ఏడుస్తూనే ఇల్లు చేరుకున్నాను.

******

కార్ ని సరిగ్గా షెడ్ లో కూడా పార్క్ చేయకుండా వేగంగా ఇంట్లోకి పరిగెత్తాను. హాల్లోనే అమ్మ కూర్చుని ఉంది.

“ఏమైంది?” అంది.

ఆమె మాటని పట్టించుకోకుండా మెట్లెక్కి నా రూమ్ కేసి పరిగెత్తాను. ధడేల్మని తలుపేశాను.

ఏంటి అసలు ఆల్బర్ట్ ఉద్దేశం?... ఒకసారి దాన్ని ట్రై చేస్తాడా?... నాకుతెలిసి ఒకసారి ఆల్బర్ట్ ఏ అమ్మాయినైనా వదిలేశాక మళ్ళీ ఇంకోసారి తిరిగి చూడలేదు. మరి దాన్ని మళ్ళీ ట్రై చేస్తా అంటాడేంటి?. పైగా దాని మనసు కూడా అంత మంచిదిగా అనిపించట్లేదు. కారణం లేకుండా ఇండియన్స్ మీద ద్వేషం పెంచుకుంది. కారణం ఏదైనా ద్వేషం నిండిన మనసులో ప్రేమ ఎలా ఉంటుంది?... అవునూ..., అది ఎలా ఉంది? మాల్ ముందు గమనించిన దాని రూపం కళ్ళముందు తళుక్కుమంది. చాలా బాగుంది! మరి నేనెలా ఉన్నాను? వెంటనే అద్దం ముందుకెళ్లాను. నేను కూడా బానేవున్నాగా?! కర్వీ స్ట్రక్చర్, చెక్కని ముఖం, ఆకట్టుకునే కళ్ళు! ఏం తక్కువ నాకు? మరి ఎప్పుడో వదిలి వెళ్ళిపోయినదాన్ని మళ్ళీ ట్రై చేస్తా అంటాడు గాని పక్కనే ఉన్న కొత్తదాన్ని నన్ను పట్టించుకోడు ఏంటి ఆల్బర్ట్?... బహుశా నేను ఇండియన్ ని అవటం అడ్డు అనుకుంటున్నాడా?... నా స్కిన్ టోన్ కీ, తన స్కిన్ టోన్ కీ మ్యాచ్ అవదని భావిస్తున్నాడా?! అవునూ..., అది ఆల్బర్ట్ ని ట్రైల్ రూమ్ లోకి ఎందుకు లాక్కెళ్లింది?... ఆలోచన రావటం ఆలస్యం అద్దంలో ప్రత్యక్షమయ్యారు వాళ్ళు.

అది ఆల్బర్ట్ ని రూమ్ లోకి లాక్కెళ్లింది. డ్రస్ ట్రై చేస్తున్న మిషతో ఆల్బర్ట్ ని సాయం చేయమని అడిగింది. ఆల్బర్ట్ బుద్దిమంతుడిలా దానికి సాయం చేస్తున్నాడు. ఆ సందర్భంలో... ఒకానొక క్షణంలో... అది... ఆల్బర్ట్ ని... ట్రై చేయాల్సిన డ్రస్ ని తలుపుకి వేలాడేసి... అతడ్ని వాటేసుకుని... గాఢంగా ముద్దు....

“నో!!....” పైకే అరిచాను.

అద్దంలో దృశ్యం మాయం!

శూన్యం ఆవహించింది గది మొత్తం – నా మనసులో లాగే. వెనక్కి వెళ్ళిపోయి గోడవారగా కిందకి జారబడి మోకాళ్ళని ముడిచి ముఖాన్ని వాటిమధ్యలోకి దూర్చాను. ఏడుపు తన్నుకొచ్చింది.

“మేఘనా?...” ఇంతలో పిలుపు.

ఏడుపు కళ్ళతోనే తలపైకెత్తాను. ఎదురుగా అమ్మ నించుని ఉంది. ఇందాక నా అరుపు వినబడినట్టు ఉంది వచ్చింది.

“ఏమైంది అమ్మా?...” అంటూ వచ్చి నా పక్కన కూర్చుంది.

“అమ్మా...” అంటూ తన ఒళ్ళోకి ముఖం వాల్చేశాను. ఏడుపు కట్టలు తెంచుకుంది. తనివితీరా ఏడ్చాను. నేను ఏడుస్తున్నంతసేపు అమ్మ ఒక్కమాట కూడా మాట్లాడలేదు. నా ముంగురులని సరిచేస్తూ అలానే ఉంది. నేను తెప్పరిల్లి, “సారీ అమ్మా..., నిన్ను టెన్షన్ పెట్టి ఉంటే” తన ఒళ్ళో అలా పడుకునే అన్నాను.

“అతడి గురించేనా ఇదంతా?” అంది.

ఆశ్చర్యంగా లేచాను నేను. “నీకు ఎలా తెలుసు?” అన్నాను.

“నేను మీ అమ్మని” ఆహ్లాద వదనంతో అంది.

నేను మాట్లాడలేదు.

కాసేపాగి, “ఎందుకు అమ్మా..., నేను అతడికి నచ్చలేదు? నువ్వు చిన్నప్పటినుంచి చెప్తూ ఉంటావ్ గా..., మనం ఎదుటివారికి ఏం ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది అని. నువ్వు ఇప్పుడు ఏం చేస్తే అదే రేపు నీకు జరుగుతుంది అంటావ్ గా. రెండు సంవత్సరాలుగా నేను అతడికి ప్రేమనే ఇస్తూ ఉన్నాను. నన్ను అతడు ప్రేమిస్తే ఎలా చూసుకోవాలి అని కోరుకుంటానో అలానే నేను అతడ్ని చూస్తూ వస్తున్నాను. మరి అతడు నన్ను ఎందుకు లవ్ చేయడు?” వెక్కుతూ అన్నాను.

నవ్వింది. ఆ నవ్వులో ప్రసన్నత. ఆ వెంటనే, “నిజం చెప్పనా..., నిన్ను చూస్తే ఎవరికీ ప్రేమించాలి అనిపించదు. అంటే తప్పుగా అని కాదు. నిన్ను చూడగానే ఎవరికైనా తమ ఆత్మీయురాల్ని చూసినట్టు అనిపిస్తుంది. అన్నీ పంచుకోవాలి అనిపిస్తుంది. నిర్భయంగా సాయం అడగాలనిపిస్తుంది. అంతేకాని ప్రేమించాలి అనిపించదు. పైగా పెద్దగా హైట్ కూడా ఉండవు కదా...” క్రిగంట చూస్తూ అంది.

“అమ్మా!...”

“హ... హ... సరేసరే..., నిజం చెప్తున్నా. నువ్వు తెలివైనదానివి. ఎవరైనా నీతో ఉండటానికి ఇష్టపడతారు. భావాల్ని పంచుకుంటారు. వాళ్ళ భావాలకి తగ్గట్టు వాళ్ళు కోరుకునే విధంగా స్పందించగలవు. కానీ నీ భావాల్ని మాత్రం వ్యక్తపరచలేవు. నీది మీ నాన్నగారి స్వభావం. ఎదుటివాళ్లు ఏమనుకుంటారో అనే భయంతో నీ భావాల్ని నీలోనే అణుచుకుంటావు. నాదీ, మీ నాన్నగారిదీ లవ్ మ్యారేజ్ అని తెలుసుగా? అప్పుడు ఏమైందో తెలుసా?...”

అమ్మ తన లవ్ మ్యాటర్ తేవడంతో క్షణకాలం నా లవ్ మ్యాటర్ గురించి మర్చిపోయాను. “ఏమైంది?” కుతూహలంగా అన్నాను.

“నేనూ, మీ నాన్నగారూ ఒకే ఊళ్ళో పుట్టి పెరిగాం. నేను సర్పంచ్ కూతుర్ని. కులం తక్కువ కారణంగా ముందునుంచే మీ నాన్నగారు చదువుకోలేదు. మా నాన్నగారి పోరాటం తరువాత వాళ్ళకి బళ్ళోకి అనుమతి వచ్చింది. అలా అయిదో తరగతిలో ఉన్నప్పుడు మొదటిసారి మీ నాన్నగార్ని దగ్గరగా చూశాను. కానీ అప్పుడు మీ నాన్నగారు నాకు నచ్చలేదు. ఎందుకో తెలుసా?..., నా పెన్సిల్ కన్నా మీ నాన్నగారి పెన్సిల్ పెద్దదిగా ఉంది. హ... హ... తర్వాతర్వాత స్నేహం కుదిరింది. అది పెద్దవుతూ ప్రేమగా మారింది. మా ఇద్దరికీ తెలుస్తున్నా కూడా ఇద్దరం బయటపడలేదు. నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు మా పక్కూరి సర్పంచ్ కొడుకుతో పెళ్లి కుదిర్చారు మా నాన్నగారు. నాకేమీ పాలుపోలేదు. మీ నాన్నగారేమో బయటపడరు. ఇక నేనే సాహసం చేసి పెళ్లి ముందురోజనగా రాత్రి మీ నాన్నగారిని కలిసి కుండబద్దలు కొట్టేశాను. మీ నాన్నగారూ అవునన్నారు. అక్కడికక్కడే పెళ్లి చేసుకున్నాం. వేరే చోటుకి పారిపోయాం. కొంత కాలానికి వెళ్ళి నాన్నగారి ముందు నించున్నాం. మా నాన్నగారు ఎంత సంఘసంస్కర్త ఐనా తనదాకా వచ్చేసరికి తత్వం బోధపడింది. కూతురు అలా చేసేసరికి తట్టుకోలేకపోయారు. మా జంటని ఊరినుంచి వెలేశారు. తరువాత అమ్మ చనిపోయాక పదహారు సంవత్సరాలకి మీ నాన్నగారి మంచితనం, ఉన్నతస్థితి కారణం అయితేనేమీ, వాళ్ళువీళ్ళు సర్దిచెప్పటం కారణమైతేనేమీ అప్పట్నించి మళ్ళీ మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఒకటి చెప్తాను విను మేఘనా..., ద్వేషాన్ని ఐనా ప్రేమని ఐనా వ్యక్తపరచాలి. అప్పుడే ఎదుటివారు నిన్ను అర్ధం చేసుకుంటారు. వాళ్ళకి నువ్వు కావాలి అనుకుంటే తదనుగుణంగా వాళ్ళని వాళ్ళు మార్చుకుని నీకు స్పందిస్తారు. అక్కర్లేదు అనుకుంటే వదిలేసి వెళ్లిపోతారు. అంతేకాని భావాల్ని మనసులోనే అనుచుకుని వాళ్ళు నన్ను అర్ధంచేసుకోలేదు అనటం మూర్ఖత్వం! అప్పుడు నా భావాల్ని మీ నాన్నగారి ముందు వ్యక్తపరచకుండా వేరే అతన్ని పెళ్లి చేసేసుకుని ఉండి ఉంటే ఇప్పుడు ఇలా నీతో మాట్లాడేదాన్ని కాదుగా?...” అంది.

నాన్న నిజమే చెప్పారు. అమ్మ దేవత! నేను అమాంతం అమ్మని వాటేసుకుని ముద్దుపెట్టుకున్నాను.

“కాకపోతే ఒకటి..., ఆ అబ్బాయి నాకు నచ్చడు. నేను మొదటిసారి ఆ అబ్బాయిని చూసిందే భహిరంగంగా వేరే అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నప్పుడు. నీక్కూడా చూపించానుగా?! సరే ఈ దేశంలో అంతే. ఒప్పుకుంటాను. కానీ అది నాకు నచ్చలేదు”

“నీకు ఒకదాని గురించే తెలుసు. నాకు చాలావాటి గురించి తెలుసు. ఈరోజు కూడా మాల్ లో ఏదో జరిగే ఉండి ఉంటుంది” అనీ అన్నట్టు అన్నాను.

“ఏంటి?”

“ఆహా..., ఏం లేదు”

“సరే గుర్తుందిగా రేపే న్యూయార్క్ కి మన ప్రయాణం. భరద్వాజ్ అంకుల్ కూతురి పెళ్లికి వెళ్ళాలి”

“గుర్తుంది”

“సరే లేచి రూమ్ ని సర్దుకో. చూడు ఎంత చండాలంగా ఉందో?...”

రూమ్ మొత్తం కలియచూశాను. దరిద్రంగానే ఉంది. ఐతే నేనున్న పరిస్థితికి ఇప్పుడు రూమ్ ని సర్దుకోమనటం ఏంటో అర్ధంకాలేదు. అర్ధంకానట్టే అమ్మకేసి చూశాను.

“మనసు అలజడిగా ఉన్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలి. పైగా రూమ్ ని సర్దుతూ ఒక కొలిక్కి తీసుకొచ్చేసరికి నీ ఆలోచనలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. అనుభవం మీద చెప్తున్నా” అని లేచి వెళ్లిపోయింది.

కాసేపు ఆలోచించి వెంటనే సెల్ తీశాను. ఆల్బర్ట్ కి మెసేజ్ టైప్ చేయటం స్టార్ట్ చేశాను.

“హేయ్ ఆల్బర్ట్..., రేపు మేము న్యూయార్క్ కి ఇండియన్ వెడ్డింగ్ కోసం వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తావా? చాలామంది అందమైన ఇండియన్ గర్ల్స్ ఉంటారు. వాళ్ళలో నీ సోల్ మేట్ దొరుకుతుందేమో? హూ నోస్?...”

టైప్ చేశాక మళ్ళీ ఒకసారి చదివి సెండ్ బటన్ నొక్కాను.

“షూర్ తప్పకుండా వస్తా...” వెంటనే రిప్లై వచ్చింది.

అమ్మ మాటలతో నాలో మళ్ళీ ఆశ చిగురించింది. అక్కడి ఇండియన్ గర్ల్స్ లో నేనే అతడి సోల్ మేట్ ని అని చెప్పాలనేది నా ప్లాన్. అలా అనుకుని రూమ్ ని సర్దటానికి సమాయత్తమయ్యాను. అప్పుడే ఎప్పుడు వచ్చిందో వచ్చింది అమ్మ. తలుపు దగ్గర నించుని –

“మా నాన్నగారిది గట్టి గుండె కాబట్టి కూతురు లేచెల్లిపోయినా తట్టుకున్నారు. కానీ నాదీ, మీ నాన్నగారిదీ అంత గట్టి గుండె కాదు. మేము తట్టుకోలేం” అంది.

నేను అమ్మకేసి చూస్తూ నిలుచుండిపోయా.



Rate this content
Log in

Similar telugu story from Drama