Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Rama Seshu Nandagiri

Drama

4.5  

Rama Seshu Nandagiri

Drama

బుర్ఖా

బుర్ఖా

2 mins
348


శ్రీధర్ తన స్నేహితులు రామ్, సురేష్ లతో కలిసి కారు లో వెళ్తున్నాడు. సిగ్నల్ పడటం తో కారు ఆపి శ్రీధర్, రామ్ అమ్మాయిల మీద ఏవో జోక్స్ వేసుకుంటున్నారు. సురేష్ మాత్రం

మౌనంగా ఉన్నాడు.


ఇంతలో ఒక స్కూటీ కారు పక్కగా ఆగింది. దాని మీద బుర్ఖా లో ఉన్న అమ్మాయి ఉంది. ఆమె ముంజేతుల వరకు బుర్ఖా కప్పేసింది. అమ్మాయో, ఆంటీయో తెలియక శ్రీధర్, రామ్ ఆమె నే గమనిస్తున్నారు.


"ఏంటో రా బాబూ, ఈ బుర్ఖా లో ఉన్న వాళ్ళని ఏం కామెంట్ చేయలేం.ఎంత అందం ఉండి ఏం లాభం. బుర్ఖా లో దాచేస్తారు.

ఇలాంటి అమ్మాయిల్ని ఎవరు లవ్ చేస్తారు?" అన్నాడు శ్రీధర్.


"అవును పాపం ఈ ముస్లిం పాపలకి కామెంట్స్, కాంప్లిమెంట్స్

ఏవీ ఉండవు." అన్నాడు రామ్ జాలి పడుతున్నట్లుగా.

ఇంతలో సిగ్నల్ ఇవ్వడం తో కారు ముందుకు కదిలింది.


"నోర్ముయ్యండిరా. పెద్ద కబుర్లు చెప్తున్నారు. బుర్ఖా ఉంది కాబట్టి ఎవరూ వాళ్ళ జోలికి త్వరగా రారు. లేకుంటే ఈ పిల్లకి కూడా

మరో నిర్భయ లేదా దిశ గతి పట్టేది. అందుకే ఆడవాళ్ళు బుర్ఖా లో ఉంటేనే సేఫ్ అనుకుంటున్నారు." అన్నాడు కోపంగా సురేష్.


"అదేంటి రా, ఏదో సరదాగా అంటే అలా సీరియస్ అవుతావు."

అన్నాడు శ్రీధర్ ఆశ్చర్యంగా.


"మరి, లేకపోతే ఏంటి రా. మనం మగాళ్ళమని మరిచి పోయి మృగాళ్లు గా గొప్ప పేరు తెచ్చుకుంటున్నాం కదా! ఇంట్లో తల్లి, అక్కా చెల్లెళ్ళు కూడా అనుమానించే స్థితికి మనని మనమే దిగజార్చుకున్నాం." అన్నాడు సురేష్ ఇంకా కోపంగా.


"అక్కడికి మేం ఏదో చేసేసినట్లు మాట్లాడతావేంటి? ఏదో సరదాగా కామెంట్స్ చేస్తాం, అంతేగా." అన్నాడు రామ్ పరుషంగా.


"ఇదీ సరదాయేనా. ఆ స్కూటీ మీద ఉన్న ఆమె, మన తల్లో, ఆక్కచెల్లెలో అయి, ఇంకెవరైనా కామెంట్ చేసినా సరదాగా తీసుకుంటారా." తీవ్రంగా అడిగాడు సురేష్.


ఇద్దరూ మౌనం వహించారు. సురేష్ కూడా కొంత సేపు మాట్లాడలేదు. ఇంతలో కారు ఆగింది. ముగ్గురూ వెళ్ళి శ్రీధర్ వాళ్ళ అవుట్ హౌస్ లాన్ లో కూర్చున్నారు.


"ఒరేయ్, ఎవర్నైనా కామెంట్ చేసే ముందు , అదే‌మన వాళ్ళైతే, అని ఒక్కసారి ఆలోచించండి రా. మన మనసులోకి వచ్చిన ఆ ఆలోచన నీరు కారిపోతుంది." అన్నాడు సురేష్.


"నిజమే రా. నీవన్నది నిజమే. మనని చూసి మనం ఇంట్లో వాళ్ళే భయ పడేటట్లుగా మనం ప్రవర్తించ కూడదు. ఇంకెప్పుడూ ఇలా మాట్లాడం రా, ప్రామిస్." అన్నాడు శ్రీధర్ సురేష్ చేతిలో చేయి వేస్తూ.


"అంతే కాదురా. నీలాంటి వాడే నన్ను కామెంట్ చేసాడు, అని మన అక్కచెల్లెళ్ళ చేత అనిపించుకో కూడదు రా. ప్రామిస్ రా సురేష్, మమ్మల్ని మేం మార్చుకుంటాం. నీ లాంటి మంచి స్నేహితుడు ఉండటం మా అదృష్టం రా." అంటూ ‌రామ్ సురేష్ ని

కౌగిలించుకున్నాడు. సురేష్ నవ్వుతూ శ్రీధర్ ని కూడా దగ్గరకు తీసుకొన్నాడు.



Rate this content
Log in

Similar telugu story from Drama